రెండు మొబైల్‌ ఫోన్లు ఉపయోగిస్తూ, చెవుల్లో హెడ్‌ఫోన్లు పెట్టుకుని నిర్లక్ష్యంగా ఆటో నడుపుతున్న ఓ డ్రైవర్‌ వీడియోను హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన.. సదరు ఆటోను గుర్తించి, డ్రైవర్‌పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులను ఆదేశించారు.

డ్రైవింగ్‌ సమయంలో మొబైల్‌ ఫోన్లు వినియోగించడం, హెడ్‌ఫోన్లు ధరించడం వల్ల ఏకాగ్రత దెబ్బతిని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని సజ్జనార్‌ హెచ్చరించారు. ముఖ్యంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ప్రయాణ సమయంలో డ్రైవర్‌ ఇలాంటి నిర్లక్ష్యానికి పాల్పడుతున్నట్లు గమనిస్తే ప్రయాణికులు వెంటనే అప్రమత్తం చేయాలని కోరారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉంటే ట్రాఫిక్‌ పోలీసులకు లేదా అత్యవసర సహాయం కోసం 112 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయానికి దారితీయవచ్చని ఆయన పేర్కొన్నారు

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో, వాహనదారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచే ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ఓ ఆటో డ్రైవర్‌ వాహనం నడుపుతూనే ఒకేసారి రెండు మొబైల్‌ ఫోన్లు ఉపయోగించడంతో పాటు చెవుల్లో హెడ్‌ఫోన్లు పెట్టుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తీవ్రంగా స్పందించారు. ప్రయాణికుల భద్రతను ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వీడియోలో కనిపించిన ఆటోను గుర్తించి, సంబంధిత డ్రైవర్‌పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులను ఆదేశించారు.

సోషల్‌ మీడియాలో ఓ నెటిజన్‌ తనకు పంపించిన వీడియోను హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు. ఆ వీడియోలో ఆటో డ్రైవర్‌ ముందు రెండు మొబైల్‌ ఫోన్లు ఏర్పాటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఒక ఫోన్‌లో గమ్యస్థానానికి చేరుకునేందుకు నావిగేషన్‌ మార్గాన్ని చూస్తుండగా.. మరో ఫోన్‌లో సినిమా చూస్తున్నట్లు దృశ్యాలు ఉన్నాయి. దీనికి తోడు చెవులకు పెద్ద హెడ్‌ఫోన్లు ధరించి ఆటో నడుపుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వెనుక నుంచి ప్రయాణిస్తున్న మరో వాహనదారుడు ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ ఆటో రిజిస్ట్రేషన్‌ నంబర్‌ TG15U2657గా గుర్తించారు.

ఈ ఘటనపై సజ్జనార్‌ తీవ్రంగా స్పందించారు. రెండు ఫోన్లలో ఒకదానిపై నావిగేషన్‌, మరోదానిపై సినిమా చూస్తూ.. చెవుల్లో హెడ్‌ఫోన్లు పెట్టుకుని ఆటో నడపడం అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. చూడటానికి ఇది బహుళ తెరల వినోదంలా కనిపించినా, ఆటోలో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే చర్యగా అభివర్ణించారు.

డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు క్షణకాలం పాటు దృష్టి రోడ్డుపై నుంచి మళ్లినా తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని సజ్జనార్‌ హెచ్చరించారు. అలాంటిది సినిమా చూస్తూ, హెడ్‌ఫోన్లు ధరించి వాహనం నడపడం తీవ్రమైన నిర్లక్ష్యమని పేర్కొన్నారు. ఇలాంటి ప్రవర్తన వల్ల డ్రైవర్‌తో పాటు ప్రయాణికులు, రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని స్పష్టం చేశారు. రహదారి భద్రత విషయంలో ప్రతి డ్రైవర్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *