
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న ‘గన్‌మాస్టర్ G9’ సినిమా షూటింగ్లో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. క్లైమాక్స్ యాక్షన్ సీన్ చిత్రీకరణ సమయంలో క్రేన్‌కు వేలాడదీసిన ఓ ఎస్యూవీ గాల్లో పల్టీలు కొడుతూ కింద పార్క్ చేసి ఉన్న వ్యాన్‌పై పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇమ్రాన్ హష్మీకి కారు అత్యంత సమీపంలో పడటంతో ఆయనకు ప్రమాదం తప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
యాక్షన్ సీన్లో అనుకోని ఘటన
‘గన్‌మాస్టర్ G9’ క్లైమాక్స్ కోసం చిత్ర బృందం భారీ కార్-ఫ్లిప్ స్టంట్‌ను ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఓ ఎస్‌యూవీని క్రేన్ సాయంతో గాల్లోకి ఎత్తారు. స్టంట్ ప్రారంభించే ముందు సిబ్బంది కౌంట్‌డౌన్ ఇచ్చారు. అయితే కారు గాల్లో తిరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కిందకు పడిపోయి, అక్కడే నిలిపి ఉంచిన వ్యాన్‌పై బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో కారు అదుపు తప్పి పడిపోవడం కనిపిస్తోంది. ఇమ్రాన్ హష్మీ ఆ సమయంలో సమీపంలోనే ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. అయితే స్టంట్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందా? లేదా ఇది చిత్రీకరణలో భాగంగా జరిగిన పరిణామమా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
నవంబర్ 27న విడుదల కానున్న సినిమా
దర్శకుడు ఆదిత్య దత్ తెరకెక్కిస్తున్న ‘గన్‌మాస్టర్ G9’లో ఇమ్రాన్ హష్మీతో పాటు జెనీలియా దేశ్‌ముఖ్, అపరశక్తి ఖురానా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 27, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. షూటింగ్లో చోటుచేసుకున్న ఈ ఘటనతో సినిమా సెట్స్‌లో భద్రతపై చర్చ మొదలైంది.
