ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను సవాల్‌ చేస్తూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓటర్ల జాబితాల సవరణలో అనుసరిస్తున్న విధానాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారం-6లో అదనపు నిబంధనలు విధించడం, సాఫ్ట్‌వేర్‌ ఆధారిత గుర్తింపు విధానాలు, ఓటర్ల పేర్లను జాబితాల్లో చేర్చడం, తొలగించడం వంటి అంశాలను ఒవైసీ తన పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

అంతేకాకుండా, ఓటర్ల జాబితాల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్న డిజిటల్‌ వ్యవస్థలపై స్వతంత్ర ఆడిట్‌ నిర్వహించాలని, ఈ ప్రక్రియకు సంబంధించిన అధికారిక రికార్డులను వెల్లడించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు వంటి అంశాల్లో అనుసరిస్తున్న విధానాలపై స్పష్టత తీసుకురావాలన్నది ఆయన పిటిషన్‌లోని ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రక్రియను సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం అధికారాల వినియోగం, ఓటర్ల నమోదు విధానాలు, ఆన్‌లైన్‌ దరఖాస్తుల్లో మార్పులు, ఓటర్ల పేర్ల చేర్పులు, తొలగింపులకు సంబంధించిన అంశాలపై తన పిటిషన్‌లో అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

గురువారం విచారణకు తీసుకోవాలని విజ్ఞప్తి

అసదుద్దీన్‌ ఒవైసీ తరఫున న్యాయవాది నిజాముద్దీన్‌ పాషా బుధవారం ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ఇతర పిటిషన్లు విచారణకు రానున్న నేపథ్యంలో.. ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా వాటితో కలిపి గురువారం విచారించాలని కోరారు.

దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌.. ఒవైసీ పిటిషన్‌ను పరిశీలించి, సంబంధిత కేసులతో కలిపి విచారణకు స్వీకరించే అంశాన్ని పరిశీలిస్తామని సూచించారు. దీంతో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై సుప్రీంకోర్టులో జరగనున్న తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది.

అసదుద్దీన్‌ ఒవైసీ తన పిటిషన్‌లో ప్రధానంగా ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన అధికారాల వినియోగంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికల సంఘం నిర్ణయాలు చట్టప్రకారం సమిష్టిగా తీసుకుంటున్నారా? ఓటర్ల నమోదుకు చట్టంలో నిర్దేశించిన ఫారాలకు అదనంగా సాఫ్ట్‌వేర్‌ లేదా కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా కొత్త నిబంధనలు విధించవచ్చా? అనే అంశాలను ప్రస్తావించారు.

అలాగే, సాఫ్ట్‌వేర్‌ ద్వారా రూపొందించే గుర్తింపులు, అభ్యంతరాల ఆధారంగా ఓటర్ల అర్హతను నిర్ణయించడం, ఓటర్ల జాబితాల నుంచి పేర్లను తొలగించడం వంటి చర్యలకు చట్టపరమైన పరిమితులు ఉండాలని పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఓటర్ల నమోదు అధికారులు (ఈఆర్వోలు) తమ చట్టబద్ధ బాధ్యతలను స్వతంత్రంగా నిర్వర్తించేలా చూడాలని కూడా ఆయన కోరారు.

ఫారం-6లో అదనపు నిబంధనలపై అభ్యంతరం

కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారు సమర్పించే ఫారం-6లో ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా అదనపు ప్రకటనను చేర్చడంపై ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టంలో పేర్కొన్న నిబంధనలకు మించి వెబ్‌ పోర్టల్‌లో మార్పులు చేయడం లేదా కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా కొత్త షరతులు విధించడం సరికాదని తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం.

ఎన్నికల సంఘం ఈసీఐనెట్‌ (ECINET) పోర్టల్‌లో ఫారం-6ను చట్టబద్ధంగా నిర్దేశించిన రూపంలోనే పునరుద్ధరించాలని ఆయన కోరారు. అదనంగా చేర్చిన ప్రకటనకు సమాధానం ఇవ్వలేదనే కారణంతో ఓటరు నమోదు దరఖాస్తులను తిరస్కరించకూడదని, వాటిని పెండింగ్‌లో ఉంచకూడదని పిటిషన్‌లో అభ్యర్థించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *