వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, బలరాం నాయక్‌తో కలిసి పరిశీలించారు. ఈ నెల 20న ఆస్పత్రిలో పరిమిత స్థాయిలో వైద్య సేవలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నవంబరులో మరిన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి, డిసెంబరు చివరి నాటికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు ప్రారంభిస్తామని తెలిపారు. పేద ప్రజలకు ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా నాణ్యమైన కార్పొరేట్‌ వైద్య సేవలను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

వరంగల్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు శుభవార్త. వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ఈ నెల 20న దసరా సందర్భంగా ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో, అక్కడి వైద్య విభాగాలను వీలైనంత త్వరగా కొత్తగా నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి భవనంలోకి తరలించి వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.

మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కలు నూతన ఆస్పత్రి భవనాన్ని పరిశీలించి, ఓపీ సేవల ప్రారంభానికి సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొత్త ఆస్పత్రి అందుబాటులోకి రావడంతో వరంగల్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి.

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో దసరా రోజున ఓపీ సేవలను ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 24 అంతస్తులతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో నవంబర్‌ నెలాఖరు లేదా డిసెంబర్‌ మొదటి వారంలోగా పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆస్పత్రి నిర్మాణానికి జీవోలు జారీ చేసినప్పటికీ, పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్మాణ పనులను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలంలో 56 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.1,150 కోట్ల వ్యయంతో ఈ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు. మొత్తం 2,208 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రిలో తొమ్మిది అంతస్తులను వైద్య సేవల కోసం వినియోగించనున్నారు. మిగిలిన అంతస్తుల్లో వైద్యుల విభాగాలు, వైద్య విద్యకు సంబంధించిన సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు.

ఆస్పత్రిలోని అన్ని వైద్య విభాగాలు దశలవారీగా అందుబాటులోకి వస్తే ఉమ్మడి వరంగల్‌తో పాటు కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. తెలంగాణ ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చే పేదలకు కూడా కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందుబాటులోకి రానుంది. దీంతో ఈ ఆస్పత్రి ఉత్తర తెలంగాణకు ప్రధాన వైద్య కేంద్రంగా మారే అవకాశం ఉంది.

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో తొలుత దసరా రోజున రెండు అంతస్తుల్లో 22 వైద్య విభాగాలకు సంబంధించి ఓపీ సేవలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఆస్పత్రి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మొత్తం 37 విభాగాల్లో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా అవయవదానం, అవయవ మార్పిడి, సంతానలేమి సమస్యలకు చికిత్స అందించే ప్రత్యేక విభాగాలను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ సదుపాయాలు అందుబాటులోకి వస్తే వరంగల్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *