ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా మరోసారి రంగంలోకి దిగింది. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని మాదాపూర్‌ ఖానామెట్‌ గ్రామంలో ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది.

స్థానిక రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గురువారం హైడ్రా సిబ్బంది ఖానామెట్‌ గ్రామానికి చేరుకుని ఆక్రమణలను తొలగించే చర్యలు చేపట్టారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఏర్పాటు చేసిన షీట్లను తొలగించి, ఆ స్థలంలో ప్రభుత్వ భూమి అని తెలియజేసే హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంతో పాటు భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణలో హైడ్రా మరోసారి కీలక చర్యలు చేపట్టింది. ఆక్రమణదారుల చెరలో ఉన్న వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్‌ ఖానామెట్‌ గ్రామంలో ఆక్రమణకు గురైన రెండు ఎకరాలకు పైగా భూమిని స్వాధీనం చేసుకుంది. రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఆదేశాలు జారీ చేయడంతో గురువారం అధికారులు రంగంలోకి దిగారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ భూమిలో ఆక్రమణదారులు ఏర్పాటు చేసిన షీట్లను తొలగించారు. భూమి చుట్టూ బ్లూ షీట్లతో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి, అది ప్రభుత్వ భూమి అని తెలియజేస్తూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. హైడ్రా సకాలంలో స్పందించడంతో ప్రభుత్వ భూమి ఆక్రమణల నుంచి విముక్తి పొందింది.

గతంలోనూ ఆక్రమణల తొలగింపునకు ప్రయత్నాలు

ఖానామెట్‌ గ్రామంలోని ఈ ప్రభుత్వ భూమిని కాపాడేందుకు రెవెన్యూ అధికారులు గతంలో పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఆక్రమణదారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించేందుకు ప్రయత్నించడంతో అధికారులు అడ్డుకునే చర్యలు చేపట్టారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో హైడ్రా అధికారులను ఆశ్రయించారు.

ఈ భూమికి సంబంధించిన వివాదంలో అనుకూలమైన న్యాయపరమైన తీర్పు వెలువడిన అనంతరం, రెవెన్యూ అధికారుల అభ్యర్థన మేరకు చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తన బృందాలను ఆదేశించారు. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని పరిరక్షించారు. ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలను అడ్డుకోవడం, విలువైన భూములను కాపాడటం లక్ష్యంగా హైడ్రా తన చర్యలను కొనసాగిస్తోంది.

హైడ్రా పేరు వినగానే ఆక్రమణదారుల్లో ఆందోళన మొదలవుతోంది. ప్రభుత్వ భూములు, సహజ సంపదను కాపాడేందుకు సంస్థ చేపడుతున్న చర్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. గతంలో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ పరిధిలో సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఈ భూముల విలువ దాదాపు రూ.30 వేల కోట్లు ఉంటుందని అంచనా.

ఈ ప్రాంతంలో చారిత్రక ప్రాధాన్యం కలిగిన రాతి గుట్టలు ఉన్నాయి. గతంలో ఈ భూములను రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు కేటాయించింది. అయితే, సహజ సిద్ధమైన రాతి గుట్టలను కాపాడేందుకు సొసైటీ టు సేవ్‌ రాక్స్‌ ప్రతినిధులు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. ఈ అంశంపై వారు హైకోర్టును కూడా ఆశ్రయించారు. రాతి గుట్టలతో పాటు ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని మున్సిపల్‌, రెవెన్యూ శాఖలను హైకోర్టు ఆదేశించింది.

అయితే, భూముల హద్దులను గుర్తించి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడంలో జాప్యం జరగడంతో ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. దీంతో సొసైటీ టు సేవ్‌ రాక్స్‌ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో విలువైన ప్రభుత్వ భూమితో పాటు చారిత్రక రాతి గుట్టలను కాపాడేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *