
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు రాబోయే మూడు గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అమలాపురం, కట్రెనికోన ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు వెల్లడిస్తున్నాయి.
బంగాళాఖాతంలో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.
ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. పిడుగులు పడే సమయంలో చెట్లు, గోడలు, హోర్డింగులు, శిథిలావస్థలో ఉన్న భవనాల కింద ఆశ్రయం పొందవద్దని హెచ్చరించారు.
ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే రైతులు, వ్యవసాయ కూలీలు ఇతర శ్రామికులు, పశుకాపరులు తమ పనులను నిలిపివేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండటం ప్రమాదకరమని తెలిపారు.
ప్రజలు వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని పిడుగుల ప్రమాదం నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
