కొటియా ప్రాంతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంపై ఒడిశా ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా అధికారులు కొటియా గ్రామాలను మూడు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ప్రకటించి, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ పరిణామంతో ఇరు రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం తెరపైకి వచ్చింది.

ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారంలో చట్టపరమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి ఉంటుందని ఒడిశా మంత్రి సురేష్‌ పూజారి వెల్లడించారు. మరోవైపు, ప్రతిపక్ష బిజూ జనతాదళ్‌ (బీజేడీ) కూడా ఈ అంశంపై స్పందించింది. ఏపీ ప్రభుత్వ చర్యను అడ్డుకోవాలని డిమాండ్‌ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తోంది. దీంతో కొటియా గ్రామాల పరిధి, ఎన్నికల నిర్వహణ అంశం రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ ప్రభావం ఇప్పుడు ఏపీ, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కొటియాకు కూడా పాకింది. కొటియాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లా అధికారులు కొటియా గ్రామాలను మూడు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ప్రకటించి, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు షెడ్యూల్‌ను విడుదల చేశారు. నామినేషన్ల స్వీకరణకు కూడా ఏర్పాట్లు చేపట్టారు. అయితే, ఏపీ ప్రభుత్వ చర్యపై ఒడిశా ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఎన్నికలను అడ్డుకుంటామంటున్న ఒడిశా ప్రభుత్వం

కొటియా ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకుంటామని ఒడిశా ప్రభుత్వం స్పష్టం చేసింది. కొటియా ప్రాంతం తమ రాష్ట్రంలో అంతర్భాగమని పేర్కొంటూ, అక్కడ ఏపీ ఎన్నికలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరాపుట్‌ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ఒడిశా రెవెన్యూ శాఖ మంత్రి సురేష్‌ పూజారి తెలిపారు.

కొటియాలో ఎన్నికల ప్రక్రియను నిలిపివేసేందుకు చట్టపరమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ అంశంపై ఆయన నేతృత్వంలో అడ్వకేట్‌ జనరల్‌, దక్షిణ రెవెన్యూ కమిషనర్‌, కోరాపుట్‌ జిల్లా కలెక్టర్‌తో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై తదుపరి చర్యలు, అందుబాటులో ఉన్న న్యాయపరమైన అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

దీంతో కొటియా గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యవహారం ఏపీ, ఒడిశా మధ్య మరోసారి వివాదానికి దారితీసింది. ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతుందా? లేక ఒడిశా ప్రభుత్వం న్యాయపరమైన చర్యలతో అడ్డుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు, ఏపీ–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా పంచాయతీ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఎన్నికల కార్యకలాపాలపై బీజూ జనతాదళ్‌ (బీజేడీ) స్పందించింది. ఈ వ్యవహారాన్ని పరిశీలించడంతో పాటు, ఏపీ ప్రభుత్వ చర్యలకు నిరసన తెలిపేందుకు పార్టీ ప్రతినిధి బృందం కొటియా ప్రాంతంలో పర్యటించనుంది.

ఈ బృందంలో మాజీ ఎంపీలు ఝినా హికాకా, ప్రదీప్ మాఝీ, మనోహర్ రంధారి, బీజేడీ గిరిజన సెల్ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే జగన్నాథ్ సారక తదితరులు ఉన్నారు. కొటియా గ్రామాల ప్రజలను నేరుగా కలిసి, వారి సమస్యలు, ఇబ్బందులు, ఆందోళనలను తెలుసుకోవాలని పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ప్రతినిధులకు సూచించారు.

ఈ వివాదంపై గతంలోనే నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వస్తే కొటియా వివాదాన్ని పరిష్కరించి, ఒడిశా ప్రాదేశిక సమగ్రతను, ఆత్మగౌరవాన్ని కాపాడుతామని ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. తాజాగా బీజేడీ ప్రతినిధి బృందం పర్యటనకు సిద్ధం కావడంతో కొటియా వివాదం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

కొటియా సరిహద్దు వివాదం ఇప్పటిది కాదు. ఏపీ, ఒడిశా రాష్ట్రాల మధ్య కొన్నేళ్లుగా ఈ సమస్య కొనసాగుతోంది. కొటియా గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 28 గ్రామాలు ఉండగా, వీటిలో 21 గ్రామాలు తమ రాష్ట్రంలోని కోరాపుట్‌ జిల్లాకు చెందినవని ఒడిశా వాదిస్తోంది. మరోవైపు, ఆ గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందుతాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంటోంది.

1936లో ఒడిశా రాష్ట్రం, 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సమయంలో సరిహద్దుల గుర్తింపులో చోటుచేసుకున్న లోపాలే ఈ వివాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ సమస్య చివరకు సుప్రీంకోర్టుకు చేరగా, 1968లో సంబంధిత గ్రామాల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ, ఈ 21 గ్రామాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. దీంతో కొటియా ప్రాంతం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *