
ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులను పూర్తి చేశామని వెల్లడించారు.
శుక్రవారం అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఎస్.రాయవరం, పాయకరావుపేట మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నాయకత్వాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
అడ్డరోడ్డు నుంచి నర్సీపట్నం వరకు రహదారి నిర్మాణాన్ని పూర్తి చేశామని అనిత తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్, టాయ్ పార్క్ వంటి పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని వివరించారు. టాయ్ పార్క్ ద్వారా సుమారు 25 వేల మంది మహిళలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు.
గోదావరి జలాలను పాయకరావుపేట నియోజకవర్గానికి తీసుకురావడం సంతోషకరమని అన్నారు. గ్రామాల అభివృద్ధి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్న అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని హోంమంత్రి అనిత ప్రజలను కోరారు.
