
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీపై నెలకొన్న సందిగ్ధతకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తెరదించింది. ప్రస్తుత లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు అనుమతి మంజూరు చేసింది. అయితే, ఈ ప్రక్రియలో ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.
ఇప్పటికే పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు మాత్రమే నగదు పంపిణీ చేయాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. కొత్తగా ఎవరినీ పింఛన్ లబ్ధిదారుల జాబితాలో చేర్చకూడదని ప్రస్తుతం అందిస్తున్న పింఛన్ మొత్తాల్లోనూ ఎలాంటి మార్పులు చేయరాదని తేల్చిచెప్పింది.
అధీకృత సిబ్బంది ద్వారానే నగదు ఉపసంహరణ పింఛన్ల పంపిణీ జరగాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) ముఖ్య కార్యనిర్వహణాధికారి సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పింఛన్ల పంపిణీపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.
