ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణశాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నష్టం సంభవించగా తాజాగా మరో అల్పపీడనం వర్షాల ముప్పును పెంచుతోంది. బలమైన ఈదురుగాలులు అతి భారీ వర్షాలతో రహదారులు, ఇళ్లు, పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది.

అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఇది శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర పరిసరాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో నవంబర్ 1, 2 తేదీల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.

శుక్రవారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. మిగిలిన జిల్లాల్లోనూ చెదురుమదురు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. రాబోయే వారం రోజుల పాటు వర్షాలు కొనసాగవచ్చని అంచనా వేసింది.

మరోవైపు భారీ వర్షాల కారణంగా వంశధార, నాగావళి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలను దాటేందుకు ప్రయత్నించవద్దని ఈతకు వెళ్లవద్దని హెచ్చరించారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.

ఇదిలా ఉండగా అర్నబ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన వరి పంటలు, అరటి, కొబ్బరి తోటలు, ఆక్వా చెరువుల పరిస్థితిని సమీక్షించారు. అనంతరం పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న ముంపు బాధితులను పరామర్శించి, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మరోవైపు తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనుంది. వర్షాలు, తుఫాన్ ప్రభావాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *