ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది.

దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 31 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్-నికోబార్ దీవుల సమీపంలో మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అనంతరం రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు ఏపీ, యానాం పరిసర ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో శుక్ర, శనివారాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.

కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆదివారం వర్షాల తీవ్రత కొంత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురవవచ్చని అంచనా వేసింది.

ఈ మూడు రోజుల పాటు తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఉరుములు, మెరుపులు, బలమైన గాలుల నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని శిథిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *