వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో అన్నాచెల్లెళ్ల మధ్య వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది. బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లోకి వైఎస్ షర్మిల ప్రవేశించకూడదంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం షర్మిల బెంగళూరుకు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్యాలెస్ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.

కోర్టు ఆదేశాల ప్రకారం షర్మిలతో పాటు ఆమె కుటుంబసభ్యులు, అనుచరులు ఎవరూ యలహంక ప్యాలెస్‌లోకి ప్రవేశించకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. న్యాయస్థానం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేసేందుకు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 19కి వాయిదా వేసింది.

అసలు వివాదం ఏంటంటే..

యలహంక ప్యాలెస్‌కు సంబంధించిన వివాదంపై సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున భీమిశెట్టి రమేష్‌బాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైఎస్ భారతి 2017 ఫిబ్రవరి 16 వరకు సదరు సంస్థలో డైరెక్టర్‌గా పనిచేశారని, ప్రస్తుతం రమేష్‌బాబుతో కలిసి ‘భగవత్ సన్నిధి ఎస్టేట్స్ ఎల్‌ఎల్‌పీ’లో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

పిటిషన్‌పై విచారణ సందర్భంగా సంస్థ తరఫు న్యాయవాది సుధీర్ మేడమ్మయ్య వాదనలు వినిపించారు. వైఎస్ భారతి తల్లి ఈసీ సుగుణమ్మ 2007 మార్చి 1న 20 ఏళ్ల కాలపరిమితితో ప్యాలెస్‌ను తమ సంస్థకు లీజుకు ఇచ్చారని కోర్టుకు వివరించారు. ఈ ప్రాంగణంలో పండ్ల తోటలు, గెస్ట్‌హౌస్‌లు, ఇతర నిర్మాణాల అభివృద్ధి కోసం సంస్థ భారీగా ఖర్చు చేసిందని తెలిపారు.

అనంతరం 2026 ఆగస్టు 27న సుగుణమ్మ తన కుమార్తె భారతి, మనుమరాళ్ల పేరిట గిఫ్ట్ డీడ్ రాసిచ్చారని న్యాయవాది పేర్కొన్నారు. గతంలో ప్యాలెస్‌లోని గెస్ట్‌హౌస్‌లో తాత్కాలికంగా నివసించేందుకు వైఎస్ షర్మిల అనుమతి తీసుకున్నారని, అయితే ప్రస్తుతం అలంకరణ పనుల పేరుతో బయటి వ్యక్తులను అక్కడికి పంపుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపించారు.

దీంతో ప్యాలెస్‌లోని నిర్మాణాలు, విలువైన పండ్ల చెట్లు దెబ్బతినే ప్రమాదం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు, పిటిషన్‌లోని అంశాలను పరిశీలించిన న్యాయస్థానం షర్మిల, ఆమె కుటుంబసభ్యులు, అనుచరులు యలహంక ప్యాలెస్‌లోకి ప్రవేశించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఆదేశాల నేపథ్యంలోనే షర్మిల బెంగళూరుకు చేరుకున్న సమయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్యాలెస్‌లోకి ఎవరూ ప్రవేశించకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో యలహంక పరిసరాల్లో ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్ 19న జరిగే తదుపరి విచారణలో ఈ వివాదంపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *