
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో జిల్లా ఎన్నికల అథారిటీ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నిర్వహించిన డిప్యూటీ మేయర్ ఎన్నికలో కూటమి అభ్యర్థి 37వ వార్డు కార్పొరేటర్ పందిరి వెంకట శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇటీవల మేయర్ ముక్కా శ్రావణి తండ్రి ముత్యాలనాయుడు ఆకస్మికంగా మరణించడంతో ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేదు. 49వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికైన ఆమె సోదరి నీలవేణి కూడా కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. మిగిలిన కార్పొరేటర్లంతా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.
గత నెల 30న జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణి మేయర్‌గా ఎన్నికయ్యారు. కార్పొరేటర్లలో టీడీపీ నుంచి 64 మంది, జనసేన నుంచి 26 మంది, బీజేపీ నుంచి ఎనిమిది మంది, వైసీపీ నుంచి 13 మంది, సీపీఎం నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థులు ఎనిమిది మంది విజయం సాధించారు. ఈ నెల 23న కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, అదే రోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 11.45 గంటలకు జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ జీవీఎంసీ కౌన్సిల్ హాల్‌కు చేరుకున్నారు. ముందుగా సభ్యుల హాజరును పరిశీలించి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన నిబంధనలను వివరించారు. అనంతరం కార్పొరేటర్లకు ప్రమాణ పత్రాలను అందజేసి అందరితో ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించారు.
తదుపరి డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. బీజేపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో కూటమి అభ్యర్థిగా 37వ వార్డు కార్పొరేటర్ పందిరి వెంకట శివప్రసాద్ పేరును ప్రతిపాదించారు. ఎంపీ ఎం. శ్రీభరత్ ఆ ప్రతిపాదనను బలపరిచారు. ఇతరుల నుంచి ఎలాంటి నామినేషన్లు రాకపోవడంతో శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. అనంతరం ఆయనకు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
నగరాభివృద్ధికి కృషి చేయాలి జీవీఎంసీ కమిషనర్
ప్రమాణ స్వీకారం ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో జీవీఎంసీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. గత పాలకవర్గం అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే ఈ ఘనత సాధ్యమైందన్నారు. కొత్త పాలకవర్గం కూడా ఇదే స్ఫూర్తితో నగరాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నూతన కార్పొరేటర్లకు మున్సిపల్ చట్టాలు, విధులు, బాధ్యతలు, హక్కులపై అవగాహన కల్పించేందుకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు.
ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం కావాలి ప్రజాప్రతినిధులు
ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఎన్నో ఆశలు ఆశయాలతో కౌన్సిల్లో అడుగుపెట్టిన కార్పొరేటర్లు ఐదేళ్ల పదవీకాలంలో వాటిని నెరవేర్చి నగరానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఎంపీ ఎం. శ్రీభరత్ మాట్లాడుతూ కార్పొరేటర్ పదవిని కేవలం హోదాగా కాకుండా బాధ్యతగా భావించాలని సూచించారు. మేయర్, డిప్యూటీ మేయర్, అధికారులతో సమన్వయం చేసుకుంటూ నగరవాసులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. విశాఖను మరింత అభివృద్ధి చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని జీవీఎంసీ నూతన పాలకవర్గం కూడా అదే దిశగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.




