
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం నుంచి రాయలసీమ మీదుగా మరో రైల్వే మార్గం అందుబాటులోకి రానుంది. గుంటూరు–గుంతకల్లు మధ్య 401 కిలోమీటర్ల మేర చేపట్టిన రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ పనులను పూర్తి చేసి కొత్త రైళ్ల రాకపోకలకు మార్గం సుగమం చేసేందుకు రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఈ రైల్వే మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు భారీగా ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా బెంగళూరు, గోవా వైపు వెళ్లే వారికి ప్రయాణ సమయం తగ్గనుంది. ప్రస్తుతం పట్టే సమయంతో పోలిస్తే దాదాపు గంటన్నర వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తయితే రైళ్ల వేగం పెరగడంతో పాటు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే ప్రాజెక్టులతో పాటు రైల్వే లైన్ల డబ్లింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన గుంటూరు నుంచి రాయలసీమలోని గుంతకల్లు వరకు రెండో రైల్వే మార్గం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ మార్గంలో మొత్తం 401 కిలోమీటర్ల మేర డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులను రూ.3,631 కోట్ల వ్యయంతో చేపట్టారు.
ఈ ప్రాజెక్టు ఖర్చులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం భరించేలా ఒప్పందం కుదిరింది. ఇప్పటివరకు ఈ మార్గంలో 376 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే అమరావతి రాజధాని ప్రాంతం నుంచి రాయలసీమతో పాటు బెంగళూరు, గోవా వంటి ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాలు అందడంతో పాటు రైళ్ల రాకపోకలు కూడా సులభతరం కానున్నాయి.
గుంటూరు–గుంతకల్లు రైల్వే మార్గంలో చలమ సమీపంలోని సొరంగం నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. బొగద వద్ద సొరంగం పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు ట్రాక్ నిర్మాణం, విద్యుద్దీకరణ పనులను కూడా వేగంగా చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు పనులన్నింటినీ 2027 జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇదే రైల్వే మార్గంలో నంద్యాల–గాజులపల్లె మధ్య రెండో రైల్వే లైన్‌ను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మార్గంలో 15 కిలోమీటర్ల మేర స్పీడ్ ట్రయల్స్ నిర్వహించారు. పరీక్షలు పూర్తయిన తర్వాత రైళ్ల రాకపోకలకు అనుమతించారు. ప్రస్తుతం ఈ మార్గంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిపేందుకు అనుమతి ఇచ్చారు. ఇదే రూట్లో దిగువమెట్ట నుంచి గాజులపల్లె ఆర్ఎస్ మధ్య రెండో లైన్ పనులు కొనసాగుతున్నాయి. వీటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
గుంటూరు–గుంతకల్లు మధ్య డబ్లింగ్ పనులు పూర్తయితే ఈ మార్గంలో రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నప్పటికీ.. రెండో లైన్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ముఖ్యంగా బెంగళూరు, గోవా వైపు వెళ్లే ప్రయాణికులకు దాదాపు గంటన్నర వరకు సమయం ఆదా అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు కూడా విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతం గుంటూరు–గుంతకల్లు మార్గంలో నంద్యాల మీదుగా ప్రతిరోజూ 24 ప్యాసింజర్ రైళ్లు, 60 గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. డబ్లింగ్ పనులు పూర్తయితే రైల్వే ట్రాక్ సామర్థ్యం పెరిగి.. మరిన్ని కొత్త రైళ్లను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఏర్పడనుంది.
గుంటూరు–గుంతకల్లు రైల్వే మార్గంలో డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు పూర్తయితే కొత్త రైళ్ల రాకపోకలకు మార్గం సుగమం కానుంది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో ప్రతిపాదనల్లో ఉన్న పలు రైలు సర్వీసులకు మళ్లీ ప్రాధాన్యత పెరగనుంది. చెన్నైకి కొత్త రైలు, విజయవాడ–బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గుంటూరు–అరుణాచలం ఎక్స్‌ప్రెస్, కర్నూలు–మచిలీపట్నం రైలు, ధర్మవరం–నర్సాపురం ఎక్స్‌ప్రెస్, కర్నూలు–విశాఖపట్నం, నంద్యాల–తిరుపతి రైళ్ల ప్రతిపాదనలను పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అలాగే గుంటూరు–గుంతకల్లు మార్గంలో ప్రస్తుతం వారానికి మూడు రోజులు నడుస్తున్న మచిలీపట్నం–బెంగళూరు కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ను ప్రతిరోజూ నడిపేలా మార్చే ప్రతిపాదనపైనా పరిశీలన జరగవచ్చని సమాచారం. డబ్లింగ్ పనులు పూర్తయితే ఈ మార్గంలో మరిన్ని గూడ్స్ రైళ్లను కూడా నడిపేందుకు అవకాశం ఏర్పడుతుంది.
వచ్చే ఏడాది ఆగస్టు నాటికి కొత్త రైళ్లు, అదనపు సర్వీసులు ఈ మార్గంలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా నంద్యాల రైల్వే జంక్షన్‌గా మరింత అభివృద్ధి చెందనుందని భావిస్తున్నారు. గుంటూరు నుంచి గుంతకల్లు వరకు రెండో రైల్వే లైన్, విద్యుద్దీకరణ పనులు పూర్తయితే ముఖ్యంగా బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. ప్రయాణ సమయం దాదాపు గంటన్నర వరకు తగ్గే అవకాశం ఉంది. విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి రాయలసీమ మీదుగా బెంగళూరుకు కొత్త రైళ్లను ప్రవేశపెట్టేందుకు కూడా మార్గం సుగమం కానుంది.
అయితే ఈ రైళ్ల ప్రతిపాదనలు ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయని, కొత్త సర్వీసుల ప్రారంభం, వాటి షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.




