తన నివాసంలో అటెండర్‌గా పనిచేస్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో అటెండర్ మణికుమార్‌రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఈ విషాద ఘటనపై కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మణికుమార్‌రెడ్డి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేసీఆర్ సతీమణి శోభ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా మణికుమార్‌రెడ్డి మృతికి సంతాపం తెలిపారు.

మణికుమార్‌రెడ్డి అంత్యక్రియలు సజావుగా జరిగేలా దగ్గరుండి పర్యవేక్షించాలని బీఆర్ఎస్ నాయకులను కేసీఆర్ ఆదేశించారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద అటెండర్‌గా పనిచేస్తున్న కస్తూరి మహేందర్‌రెడ్డి అలియాస్ మణికుమార్‌రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మణికుమార్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ, కేటీఆర్, ఇతర కుటుంబ సభ్యులు కూడా మణికుమార్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామ సమీపంలోని హనుమాన్ నగర్ చౌరస్తా వద్ద రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వెంకయ్యకుంట సమీపంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న కస్తూరి మహేందర్‌రెడ్డి అలియాస్ మణికుమార్‌రెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.

అదే బైక్‌పై ఉన్న భరత్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అర్ధరాత్రి 2 గంటల సమయంలో భరత్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

మణికుమార్ కుటుంబానికి అండగా ఉంటాం: కేసీఆర్

ఎర్రవల్లిలోని తన నివాసంలో కొన్నేళ్లుగా అటెండర్‌గా పనిచేస్తున్న మణికుమార్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకున్న కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ముస్తాబాద్ మాజీ ఎంపీపీ జనగామ శరత్‌రావుకు ఫోన్ చేసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మణికుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

మణికుమార్ తమ కుటుంబంలో ఒకరిగా కలిసిపోయారని, ఆయన అకాల మరణం తమను తీవ్రంగా కలచివేసిందని కేసీఆర్, ఆయన సతీమణి శోభ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి శైలిమతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా మణికుమార్ మృతిపై తీవ్ర సంతాపం తెలిపారు.

మణికుమార్ అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించేలా చూడాలని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, ముస్తాబాద్ మాజీ జెడ్పీటీసీ శరత్‌రావులకు కేసీఆర్ సూచించారు. మరోవైపు ప్రమాదంలో మృతి చెందిన మణికుమార్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *