
తెలంగాణలో డ్రోన్ టెక్నాలజీ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారత్ ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో ప్రత్యేకంగా డ్రోన్ టెక్నాలజీ హబ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం కందుకూరు, యాచారం మండలాల పరిధిలోని కొన్ని గ్రామాలను ప్రాథమికంగా పరిశీలిస్తోంది.
ఈ హబ్ ద్వారా డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు సాంకేతిక పరిశోధనలు, డేటా విశ్లేషణ, డ్రోన్ల పనితీరు పరీక్షలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా ఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమల క్లస్టర్‌తో ఈ కేంద్రాన్ని అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
డ్రోన్ హబ్ ఏర్పాటుకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దూరంగా ఉండటంతో పాటు అనువైన మైదాన ప్రాంతాన్ని ఎంపిక చేయాలని అధికారులు భావిస్తున్నారు. స్థల ఎంపిక, ఇతర అంశాలపై సాధ్యాసాధ్యాల అధ్యయనం పూర్తయిన తర్వాత సమగ్ర ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం కోసం పంపించనున్నారు.
భారత్ ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో మరో కీలక ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేయడం, యువతకు ప్రత్యేక శిక్షణ అందించడం, సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రత్యేక డ్రోన్ టెక్నాలజీ హబ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
డ్రోన్ల తయారీ, నిర్వహణ, పైలట్లకు శిక్షణ, డేటా విశ్లేషణ, సాంకేతిక పరిశోధనలు వంటి కార్యకలాపాలన్నింటికీ ఒకే వేదికను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా డ్రోన్ రంగంలో నైపుణ్యాభివృద్ధితో పాటు కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటికే భారత్ ఫ్యూచర్ సిటీలో ఏరోస్పేస్, రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమల కోసం ప్రత్యేక క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డ్రోన్ టెక్నాలజీ హబ్ కూడా అందుబాటులోకి వస్తే ఈ రంగాల్లో తెలంగాణ మరింత కీలక కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో డ్రోన్ సాంకేతిక రంగాన్ని కూడా భారత్ ఫ్యూచర్ సిటీ పరిసరాల్లోనే అభివృద్ధి చేస్తే ఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక సహకారంతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ హబ్ ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, యాచారం మండలాల పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలను ప్రాథమికంగా పరిశీలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో భూముల లభ్యత, భౌగోళిక పరిస్థితులు, విమానయాన భద్రత, రవాణా సౌకర్యాలు తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేపట్టనున్నారు. సాధ్యాసాధ్యాలపై పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం కోసం తీసుకెళ్లాలని అధికారులు యోచిస్తున్నారు.
డ్రోన్ హబ్ కోసం అనువైన స్థలంపై కసరత్తు
డ్రోన్ టెక్నాలజీ హబ్ ఏర్పాటులో భూముల ఎంపిక కీలకంగా మారింది. డ్రోన్ల ప్రయోగాత్మక పరీక్షలు, వాటి ఎగురవేత, నియంత్రణ, అత్యవసర సమయాల్లో ల్యాండింగ్ వంటి కార్యకలాపాలు నిర్వహించేందుకు విశాలమైన మైదాన ప్రాంతాలు అవసరం. చుట్టుపక్కల ఎత్తైన భవనాలు, విద్యుత్తు తీగలు, కొండలు, ఇతర నిర్మాణపరమైన అడ్డంకులు లేని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.
ఈ క్రమంలో కొంగరకలాన్ నుంచి ఆమనగల్లు వరకు నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్-1 పరిసర ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నారు. రహదారి నిర్మాణంలో భాగంగా కొన్ని చోట్ల కొండలు, గుట్టలను తొలగించి చదును చేస్తున్న నేపథ్యంలో.. సమీపంలో అందుబాటులోకి వచ్చే మైదాన భూములను డ్రోన్ హబ్ కోసం ఉపయోగించుకునే అవకాశాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.
మరోవైపు డ్రోన్లు నిర్దిష్ట ఎత్తుల్లో ప్రయాణించాల్సి ఉండటంతో విమానయాన భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనుంది. ముఖ్యంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తగినంత దూరంలో డ్రోన్ టెక్నాలజీ హబ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. విమానాల రాకపోకలు, పైలట్లు, విమానాశ్రయ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పౌర విమానయాన నిబంధనలకు అనుగుణంగా స్థలాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. డ్రోన్లకు అనుమతించిన ప్రాంతాలు, నిషేధిత జోన్లు, ఎగరడానికి అనుమతించే ఎత్తుల పరిమితులు, ప్రయోగాత్మక పరీక్షలకు అవసరమైన భద్రతా ప్రమాణాలపై అధికారులు అధ్యయనం చేయనున్నారు.
శిక్షణ నుంచి పరిశోధనల వరకు.. సమగ్ర కేంద్రంగా అభివృద్ధి
ప్రతిపాదిత డ్రోన్ టెక్నాలజీ హబ్‌ను కేవలం డ్రోన్లు ఎగరవేయడంలో శిక్షణ ఇచ్చే కేంద్రంగానే కాకుండా.. సమగ్ర సాంకేతిక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం యోచిస్తోంది. డ్రోన్ పైలట్లుగా ఎదగాలనుకునే యువతకు ప్రత్యేక శిక్షణ అందించడంతో పాటు ఇంజినీరింగ్ విద్యార్థులు, సాంకేతిక నిపుణులకు అధునాతన పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
డ్రోన్ల రూపకల్పన, విడిభాగాల తయారీ, సెన్సార్ల వినియోగం, బ్యాటరీ సామర్థ్యం, నావిగేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, డేటా విశ్లేషణ వంటి కీలక అంశాలపై పరిశోధనలు చేపట్టేందుకు అవకాశాలు కల్పించనున్నారు. అలాగే డ్రోన్లలో వినియోగించే సాఫ్ట్‌వేర్, కెమెరాలు, సమాచార ప్రసార వ్యవస్థలు, ఆటోమేటిక్ నియంత్రణ సాంకేతికత అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రయోగశాలలను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించనున్నారు.
ముఖ్యంగా ఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమలకు అవసరమైన అధునాతన డ్రోన్ల రూపకల్పన, అభివృద్ధికి ఈ కేంద్రం తోడ్పడనుంది. తద్వారా డ్రోన్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి తెలంగాణలో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.
ఒకప్పుడు డ్రోన్ల వినియోగం ప్రధానంగా సైనిక, రక్షణ రంగాలకే పరిమితమయ్యేది. అయితే ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో వాటి వినియోగం అనేక రంగాలకు విస్తరించింది. సరిహద్దుల పర్యవేక్షణ, నిఘా, రక్షణ కార్యకలాపాల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో పురుగుమందుల పిచికారీ, పంటల ఆరోగ్య పరిస్థితుల పరిశీలన, భూముల సర్వే, నీటి వనరుల పర్యవేక్షణకు వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
విపత్తుల నిర్వహణలోనూ డ్రోన్ల సేవలు ఎంతో ఉపయోగకరంగా మారాయి. వరదలు, అగ్నిప్రమాదాలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేయడానికి, సహాయక చర్యలను పర్యవేక్షించడానికి వీటిని వినియోగిస్తున్నారు. వైద్య రంగంలో అత్యవసర మందులు, రక్త నమూనాలు, టీకాలు, ఇతర వైద్య పరికరాలను వేగంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు డ్రోన్ సేవల వినియోగం పెరుగుతోంది.
ఇక నిర్మాణ రంగంలో భవనాలు, రహదారులు, భారీ ప్రాజెక్టుల పనుల పురోగతిని పరిశీలించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. సినిమా షూటింగ్‌లు, వివాహ వేడుకలు, ప్రభుత్వ కార్యక్రమాలు, క్రీడా పోటీల్లోనూ వీటి వినియోగం సాధారణమైంది. భవిష్యత్తులో మనుషులను సైతం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించగల డ్రోన్ ఆధారిత వాహనాల అభివృద్ధిపైనా పరిశోధనలు జరుగుతున్నాయి.
డ్రోన్ టెక్నాలజీలో వస్తున్న ఈ మార్పులకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయనున్న హబ్‌ను సమగ్ర సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డ్రోన్ల తయారీ, నిర్వహణ, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, భద్రతా వ్యవస్థలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు నిర్వహించే కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయాలని యోచిస్తోంది.
డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానానికి భవిష్యత్తులో ఉన్న అవకాశాలు, తెలంగాణలో ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్ 2.0లో విస్తృతంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ అధికారులు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించనున్నారు.
డ్రోన్ తయారీ సంస్థలను తెలంగాణకు ఆకర్షించడం, ప్రత్యేక పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయడం, యువతకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ అందించడం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డ్రోన్ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణలోనూ ఈ రంగానికి అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ముఖ్యంగా ఫ్యూచర్ సిటీలో ప్రతిపాదించిన ఏరోస్పేస్, రక్షణ పరిశ్రమల క్లస్టర్‌తో డ్రోన్ టెక్నాలజీ హబ్‌ను అనుసంధానించాలని యోచిస్తోంది. అదే జరిగితే ఒకే ప్రాంతంలో డ్రోన్ల తయారీ, పరిశోధనలు, ప్రయోగాత్మక పరీక్షలు, పైలట్ల శిక్షణ వంటి కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉంటుంది. దీంతో రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రావడంతో పాటు డ్రోన్ టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.




