ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయార్జన శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ చర్యలతో ఆదాయ లీకేజీలు తగ్గాయని వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడం ద్వారా శాఖల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు ప్రభుత్వ ఆదాయంలోనూ ప్రతిబింబించాలని అధికారులకు సూచించారు.

ప్రజలపై పన్నుల భారం మోపకుండా కొత్త ఛార్జీలు పెంచకుండా ప్రభుత్వ ఆదాయాన్ని మరింత పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. పలు శాఖల్లో పారదర్శకత ఆన్‌లైన్ సేవలు సాంకేతిక సంస్కరణల వల్ల ఆదాయం పెరుగుతోందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తిపన్ను వసూళ్ల కోసం ఏఐ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.

వాణిజ్య పన్నుల శాఖలోని నాలుగు విభాగాల్లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఏఐ స్టాక్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. పన్ను రిటర్నుల పరిశీలన ఆడిట్, తనిఖీలు, న్యాయపరమైన వ్యవహారాల్లోనూ కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు స్పెషల్ మార్జిన్‌తో కలిపి రాష్ట్ర సొంత ఆదాయం రూ.74,342 కోట్లకు చేరినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

గత ఏడాది ఇదే సమయానికి నమోదైన రూ.62,604 కోట్లతో పోలిస్తే ఈసారి రూ.11,738 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. మొత్తంగా 18.7 శాతం వృద్ధి నమోదైంది. వార్షిక ఆదాయ లక్ష్యం రూ.1,27,506 కోట్లు కాగా నవంబర్ 23 నాటికే 58 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు అధికారులు వెల్లడించారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం గత ఏడాది ఇదే సమయానికి రూ.53,692 కోట్లు ఉండగా ఈ ఏడాది రూ.63,796 కోట్లకు పెరిగింది.

అంటే రూ.10,104 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. పన్ను ఆదాయంలో 18.8 శాతం పన్నేతర ఆదాయంలో 31.3 శాతం వృద్ధి నమోదైనట్లు అధికారులు తెలిపారు. విభాగాల వారీగా ఆదాయ వివరాలు పరిశీలిస్తే వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం 18.3 శాతం వృద్ధితో రూ.5,917 కోట్లకు చేరింది. జీఎస్టీ ఆదాయం 18.1 శాతం పెరిగి రూ.3,694 కోట్ల మేర నమోదైంది. స్పెషల్ మార్జిన్‌తో కలిపి ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.20,083 కోట్లకు చేరింది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *