
రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు మలి విడత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ప్రశాంతమైన స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు మొత్తం 46,080 మంది పోలీసులను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు.
మంగళవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన చోట అదనపు పోలీసు బలగాలను మోహరిస్తామని డీజీపీ స్పష్టం చేశారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలు ఒత్తిళ్లకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించినట్లు డీజీపీ ప్రకటించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మరోవైపు రాష్ట్రంలోని మొత్తం 123 స్థానిక సంస్థల్లో 100 స్థానాలకు తొలి దశలోనే ఎన్నికలు నిర్వహించారు.
మిగిలిన 23 స్థానిక సంస్థలకు సంబంధించి న్యాయస్థానాల్లో ఉన్న కేసులు ఇటీవల పరిష్కారం కావడంతో వాటికి నవంబర్ 26న ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దీంతో ఎన్నికల నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు.




