తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలో వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవిపై వివాదం ముదురుతోంది. వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నికైన కళ్యాణ చక్రవర్తి తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. స్వయంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజీనామా చేయాలని సూచించినప్పటికీ ఆయన వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. ఈ పరిణామాలతో రాజకీయంగా వివాదం మరింత ముదిరింది. మరోవైపు కళ్యాణ చక్రవర్తి రాజీనామా చేయకపోతే నిరసనగా నిరాహార దీక్ష చేపట్టేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే శేషారావు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు మూడు పార్టీల సమన్వయంతో అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైస్‌ ఛైర్మన్‌ పదవుల కేటాయింపు విషయంలో టీడీపీ, జనసేన మధ్య కొన్ని చోట్ల విభేదాలు బయటపడుతున్నాయి.

ముఖ్యంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు జిల్లా ఆత్మకూరు, మంత్రి కందుల దుర్గేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఈ వివాదాలు తెరపైకి వచ్చాయి. మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవుల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తడంతో కూటమిలో రాజకీయంగా చర్చ మొదలైంది..

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పదవి వ్యవహారం టీడీపీ, జనసేన పార్టీల మధ్య వివాదానికి దారితీస్తోంది. పొత్తులో భాగంగా ఈ పదవిని టీడీపీకి కేటాయించినప్పటికీ.. జనసేన కౌన్సిలర్‌ కళ్యాణ చక్రవర్తి ఇద్దరు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల మద్దతుతో వైస్‌ ఛైర్మన్‌ పదవిని దక్కించుకున్నారు. దీంతో కూటమిలో విభేదాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జోక్యం చేసుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. స్వయంగా పవన్‌ కల్యాణ్‌ సూచించినా కళ్యాణ చక్రవర్తి రాజీనామాకు అంగీకరించడం లేదని ప్రచారం జరుగుతోంది.

సోమవారం ఈ వ్యవహారంపై మంత్రి కందుల దుర్గేష్‌ను పవన్‌ కల్యాణ్‌ వివరణ కోరినట్లు సమాచారం. వైస్‌ ఛైర్మన్‌ పదవికి కళ్యాణ చక్రవర్తితో రాజీనామా చేయించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గడం లేదనే వార్తలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

మంగళవారం నిడదవోలు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ జ్యోతి, వైస్‌ ఛైర్మన్‌ కళ్యాణ చక్రవర్తి, జనసేన కౌన్సిలర్లు మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చారు. మరోవైపు కళ్యాణ చక్రవర్తి వ్యవహారశైలిపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

24 గంటల్లో నిర్ణయం తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష

వైస్‌ ఛైర్మన్‌ పదవి వివాదంపై జనసేన అధిష్ఠానం 24 గంటల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని నిడదవోలు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం బూరుగుపల్లి శేషారావు అధ్యక్షతన టీడీపీ శ్రేణులు బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. దీంతో నిడదవోలులో రాజకీయ పరిణామాలు మరింత వేడెక్కాయి.

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలో సోమవారం నూతన పాలకవర్గం కొలువుదీరింది. ఛైర్‌పర్సన్‌తో పాటు 32 మంది కౌన్సిలర్లతో మున్సిపల్ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వైస్‌ ఛైర్మన్‌ పదవికి ఎన్నిక నిర్వహించారు. కూటమి పొత్తులో భాగంగా ఈ పదవిని టీడీపీకి కేటాయించగా.. ఆ పార్టీ తరఫున కొమ్మిన వెంకటేశ్వరరావును అభ్యర్థిగా నిర్ణయించారు. అయితే ఎన్నికల సమయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.

టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిన జనసేన కౌన్సిలర్లు అనూహ్యంగా సొంత పార్టీకి చెందిన నాలుగో వార్డు కౌన్సిలర్‌ కళ్యాణ చక్రవర్తిని బరిలోకి దించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఎనిమిదో వార్డు జనసేన కౌన్సిలర్‌ గంగుల వెంకటలక్ష్మి ప్రతిపాదించగా.. ఆరో వార్డు కౌన్సిలర్‌ సంజీవ్‌ సాగర్‌ బలపరిచారు. దీంతో వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది.

కళ్యాణ చక్రవర్తి పోటీకి దిగడంతో టీడీపీ కౌన్సిలర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి కొమ్మిన వెంకటేశ్వరరావుకు ఆ పార్టీ కౌన్సిలర్లు మద్దతుగా నిలిచారు. దీంతో ఇద్దరి మధ్య పోటీ అనివార్యమైంది. నిర్వహించిన ఓటింగ్‌లో కళ్యాణ చక్రవర్తికి 18 ఓట్లు, టీడీపీ అభ్యర్థి వెంకటేశ్వరరావుకు 13 ఓట్లు వచ్చాయి. జనసేనకు చెందిన 15 మంది కౌన్సిలర్లతో పాటు ఒక బీజేపీ, ఇద్దరు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు కళ్యాణ చక్రవర్తికి మద్దతుగా ఓటు వేశారు. దీంతో ఆయన వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

కూటమిలో ముదిరిన విభేదాలు

పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన పదవిని జనసేన కౌన్సిలర్‌ దక్కించుకోవడంపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి కందుల దుర్గేష్‌ సూచించినప్పటికీ జనసేన కౌన్సిలర్లు తమ వైఖరిని మార్చుకోలేదని టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో నిడదవోలు మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక వ్యవహారం టీడీపీ, జనసేన మధ్య రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *