
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు తొలి దశ పనులను వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు సుమారు 21 కిలోమీటర్ల పరిధిలో రెండు జోన్లుగా అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది.
మరోవైపు మిరాలం చెరువు అభివృద్ధి, రేడియల్ రోడ్ల నిర్మాణం, పీఆర్టీఎస్, కోహెడ ఫ్రూట్ మార్కెట్ వంటి కీలక ప్రాజెక్టులపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టుల పురోగతి, పనుల అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
హైదరాబాద్ నగర అభివృద్ధి పనులను వేగవంతం చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. క్యూర్ (CURE), ప్యూర్ (PURE) పరిధిలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్లు, మిరాలం చెరువు అభివృద్ధి, పీఆర్టీఎస్ వంటి కీలక ప్రాజెక్టుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జనవరి 2027లో మూసీ ఫేజ్-1 పనులు ప్రారంభం
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు తొలి దశ పనులను 2027 జనవరిలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఫేజ్-1లో భాగంగా పనులను రెండు జోన్లుగా విభజించారు.
జోన్-1ఏలో హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. జోన్-1బీలో ఉస్మాన్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో పనులు నిర్వహించనున్నారు. ఈ రెండు జోన్లలో కలిపి మొత్తం 21 కిలోమీటర్ల మేర మూసీ పునరుజ్జీవం పనులు చేపట్టనున్నారు.
ప్రాజెక్టు ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల అమలులో జాప్యం జరగకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు.
మిరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టును 2028 జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు సీఎంకు వెల్లడించారు. మిరాలం చెరువు పరిసర ప్రాంతాలను సుందరంగా అభివృద్ధి చేయడంతో పాటు, చెరువులో ఏళ్ల తరబడి పేరుకుపోయిన పూడికను తొలగించాలని సీఎం ఆదేశించారు. పనులన్నీ పక్కా ప్రణాళికతో, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని సూచించారు.
రేడియల్ రోడ్లు, గండిపేట గోశాలపై కీలక ఆదేశాలు
హైదరాబాద్ నగరంలో రేడియల్ రోడ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందనే విషయంపై ఆరా తీశారు. భూసేకరణకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అదేవిధంగా గండిపేటలో నిర్మిస్తున్న ఆధునిక గోశాల పనులపైనా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. అందుకు అనుగుణంగా నిర్మాణ పనుల్లో వేగం పెంచి, నిర్ణీత గడువులోగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు
హైదరాబాద్‌లో ప్రతిపాదిత పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS) ఫేజ్-1కు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలు, మార్గాల ఎంపికపై అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. తొలి దశలో రెండు కీలక మార్గాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో కూకట్పల్లి నుంచి రాయదుర్గం మీదుగా బయోడైవర్సిటీ వరకు ఒక మార్గాన్ని ప్రతిపాదించారు. మరో మార్గాన్ని బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి సెక్రటేరియట్, బషీర్‌బాగ్ మీదుగా రాణిగంజ్ వరకు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు మార్గాల్లో పీఆర్టీఎస్ వ్యవస్థ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను సీఎంకు వివరించారు.
పీఆర్టీఎస్ డిపోల ఏర్పాటుపై సీఎం సూచనలు
పీఆర్టీఎస్ ప్రాజెక్టు కోసం నెక్లెస్ రోడ్, రాయదుర్గం, పీపుల్స్ ప్లాజా పరిసరాల్లో డిపోల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించి సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. డిపోల సమీపంలో మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉండేలా ముందుగానే ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
ప్రతిపాదిత మార్గాలు, డిపోల నిర్మాణం, ప్రయాణికుల రాకపోకలు, ఇతర సాంకేతిక అంశాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే తుది ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు.
సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ (సీఎంసీ) పరిధిలోని ఐఐఐటీ జంక్షన్ వద్ద నిర్మించనున్న ఫుట్ఓవర్ బ్రిడ్జి (FOB)కు సంబంధించిన పలు డిజైన్లను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. వాటిని పరిశీలించిన సీఎం పలు మార్పులు, సూచనలు చేశారు. ఫుట్ఓవర్ బ్రిడ్జి సమీపంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ప్రాంతంలో వాహనాల పార్కింగ్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కోహెడ మార్కెట్ నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం
కోహెడలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ పనుల పురోగతిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు స్పష్టం చేశారు. మార్కెట్ ప్రారంభమైన తర్వాత రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా సమాంతర రహదారుల నిర్మాణాన్ని కూడా అదే సమయంలో పూర్తి చేయాలని సూచించారు.
చెరువుల పునరుద్ధరణకు ఎస్టీపీలు.. మెట్ల బావులకు రక్షణ
క్యూర్ (CURE) పరిధిలో చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు చేపడుతున్న చర్యలపై ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు (STPలు) ఏర్పాటు చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరించారు. ఈ కేంద్రాల నిర్మాణ ప్రతిపాదనలను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం ఆదేశించారు.
అదేవిధంగా హైదరాబాద్‌లోని పురాతన మెట్ల బావుల పరిరక్షణ, పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. చారిత్రక కట్టడాల ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని సంరక్షించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు.




