
ఎలమంచిలి మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీకి చెందిన గొర్లె శివనారాయణమూర్తి (నానాజీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించాల్సిన ఎన్నిక కోరం లేక వాయిదా పడగా మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు.
ప్రిసైడింగ్ అధికారి, అడ్డరోడ్డు ఆర్డీవో వెంకట రామలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. మొత్తం 32 వార్డుల కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ రమాకుమారి హాజరయ్యారు. సోమవారం ప్రమాణ స్వీకారానికి హాజరుకాని జనసేనకు చెందిన 11 మంది కౌన్సిలర్లతో తొలుత ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక చేపట్టారు.
30వ వార్డు నుంచి టీడీపీ తరఫున గెలుపొందిన గొర్లె నానాజీ పేరును 21వ వార్డు కౌన్సిలర్ కొత్తలంక రాజేశ్ ప్రతిపాదించగా 13వ వార్డు కౌన్సిలర్, బీజేపీకి చెందిన సీరా సాయి ప్రసన్న బలపరిచారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ సూచనతో జనసేన కౌన్సిలర్లు కూడా నానాజీ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
నూతన వైస్ చైర్మన్ నానాజీని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, చైర్పర్సన్ రమాకుమారి ఇతర కౌన్సిలర్లు అభినందించారు. ఎన్నిక ప్రక్రియ ముగిసిన అనంతరం కౌన్సిల్ హాలులోకి వచ్చిన వైసీపీ కౌన్సిలర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదిలా ఉండగా వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యే విజయకుమార్, చైర్పర్సన్ రమాకుమారి పక్కపక్కనే కూర్చున్నప్పటికీ ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ఎన్నికకు ముందు మంగళవారం ఉదయం టీడీపీ, బీజేపీ, స్వతంత్ర కౌన్సిలర్లు ప్రత్యేక వాహనంలో రైల్వే స్టేషన్ రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కొద్దిసేపటికి జనసేన కౌన్సిలర్లు కూడా అక్కడికి రావడంతో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ వారితో సమావేశమయ్యారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు టీడీపీ జిల్లా ఎన్నికల పరిశీలకుడు కె. అప్పలనాయుడుతో కలిసి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.
వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో కూటమి పొత్తు ధర్మానికి, పార్టీ అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకుంటామని విజయకుమార్ స్పష్టం చేశారు. అనంతరం కూటమి నాయకులు కౌన్సిలర్లు కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్నారు.




