
శ్రీ సత్యసాయి బ్యూరో, : గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన వసతులు కల్పించడంతో పాటు ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
బుధవారం ధర్మవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రూట్ మ్యాప్‌ల ఆధారంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర ఎన్నికల సామగ్రిని నిర్ణీత సమయంలో అందజేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది సకాలంలో చేరుకునేందుకు అవసరమైన వాహనాలను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు.
ఎన్నికల సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించాలి
ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి తాగునీరు, భోజన వసతి కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. కేంద్రంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అత్యవసర వైద్య సేవల కోసం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే పోలీసు బందోబస్తు పటిష్టం చేయడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఈ తనిఖీలో ధర్మవరం ఆర్డీఓ రాంభూపాల్ రెడ్డి, తహశీల్దార్ దేవరాజు, రెవెన్యూ, పోలీసు అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.




