అనకాపల్లి మండలం పిసినికాడ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌కు రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వ భూమిని ఆక్రమించి గ్రావెల్ రోడ్డు నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలోని ఓ కార్పొరేటర్ భర్త ఉన్నట్లు వారు చెబుతున్నారు. సుమారు కోటి రూపాయలకు పైగా విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పిసినికాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 38/1, 38/2లో ఉన్న 8.36 ఎకరాల భూమిలో లేఅవుట్ ఏర్పాటు చేసేందుకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడు వీఎంఆర్‌డీఏకు దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో ఆయన తల్లి ప్రజాప్రతినిధిగా ఉన్నారు.

అయితే లేఅవుట్‌లోకి వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో మధ్యలో ఉన్న సర్వే నంబర్ 43లోని ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాల ద్వారా రహదారిగా చూపించి అనుమతులు పొందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై అప్పట్లోనే స్థానికులు అనకాపల్లి పట్టణ పోలీసులతో పాటు రెవెన్యూ, వీఎంఆర్‌డీఏ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వెంచర్ పనులు నిలిచిపోయాయి.

అయితే ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన ఓ కార్పొరేటర్ భర్తను సదరు రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్వాహకుడు సంప్రదించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంచర్‌కు రహదారి సౌకర్యం కల్పిస్తే కొంత వాటా ఇస్తానని ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. ఇందుకు అంగీకరించిన కార్పొరేటర్ భర్త సర్వే నంబర్ 43లోని 70 సెంట్ల ప్రభుత్వ స్థలంలో 25 సెంట్లను ఆక్రమించి రహదారి నిర్మాణానికి పూనుకున్నారని ఆరోపిస్తున్నారు.

గత మూడు రోజులుగా గ్రావెల్‌తో రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఈ విషయంపై స్థానికులు మరోసారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణాన్ని ఎవరైనా అడ్డుకుంటే సహించేది లేదంటూ కార్పొరేటర్ భర్త హెచ్చరిస్తున్నారని కూడా ఆరోపించారు.

ప్రస్తుతం పిసినికాడ ప్రాంతంలో సెంటు భూమి విలువ సుమారు రూ.5 లక్షలు పలుకుతోందని ఆక్రమణకు గురైనట్లు చెబుతున్న ప్రభుత్వ స్థలం విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే కాకుండా అందులో రహదారి నిర్మాణం చేపడుతున్నారన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని వారు కోరుతున్నారు. భూమిని పరిశీలించి ఆక్రమణ నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *