శ్రీకాకుళం జిల్లాలో మున్సిపల్ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస మున్సిపాలిటీతో పాటు తొలి విడతలో పలాస రెవెన్యూ డివిజన్ పరిధిలోని పంచాయతీలకు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. ఈ నెల 26న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చివరి రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి మద్దతుదారులు భారీ ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించారు.

శ్రీకాకుళం నగరపాలక సంస్థకు మేయర్‌తో పాటు 60 డివిజన్లలో కార్పొరేటర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆమదాలవలస మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌తో పాటు 28 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. మరోవైపు పలాస రెవెన్యూ డివిజన్ పరిధిలోని 173 గ్రామ పంచాయతీలు, 1,033 వార్డు సభ్యుల స్థానాలకు కూడా అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి.

ప్రచారం ముగియడంతో అభ్యర్థులు తదుపరి వ్యూహాలకు పదును పెట్టారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడంతో పాటు తమకు అనుకూలంగా ఓటు వేసేలా అంతర్గత ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఫోన్లు, బంధువులు, స్థానిక నాయకుల ద్వారా ఓటర్లను సంప్రదించే ప్రయత్నాలు మొదలయ్యాయి. మరోవైపు ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

శ్రీకాకుళం నగరపాలక సంస్థలో మేయర్, కార్పొరేటర్ స్థానాలకు కలిపి మొత్తం 173 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీలో 68 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నెల 26న పోలింగ్ జరగనుండగా ఫలితాలను ఈ నెల 30న ప్రకటించనున్నారు.

ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 194 సర్పంచ్ స్థానాలకు గాను 21 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 173 స్థానాలకు 437 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం 1,922 వార్డు సభ్యుల స్థానాల్లో 886 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 1,033 స్థానాలకు 2,192 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఎన్నికల ప్రచారానికి తెరపడటంతో గ్రామాల్లో రాజకీయ సందడి మరింత పెరిగింది. అభ్యర్థులు వారి అనుచరులు చివరి నిమిషంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గురువారం పోలింగ్ జరగనుండగా అదే రోజు మధ్యాహ్నం పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *