ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్ పోరు తొలి గేమ్‌తో ప్రారంభమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ డి. గుకేశ్, ఛాలెంజర్ జావోఖిర్ సిందరోవ్ మధ్య మంగళవారం జరిగిన మొదటి గేమ్ డ్రాగా ముగిసింది. మొత్తం 37 ఎత్తుల పాటు సాగిన ఈ పోరులో ఇరువురు ఆటగాళ్లు ఒక్కో పాయింట్‌ను పంచుకున్నారు.

ఒత్తిడిలోనూ నిలిచిన గుకేశ్

తొలి గేమ్‌లో నల్ల పావులతో బరిలోకి దిగిన గుకేశ్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. సిందరోవ్ ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించినప్పటికీ గుకేశ్ సమర్థంగా అడ్డుకున్నాడు. ముఖ్యంగా 17వ ఎత్తు వేయడానికి గుకేశ్ ఏకంగా 36 నిమిషాల 14 సెకన్ల సమయం తీసుకున్నాడు. దీంతో మిగిలిన ఎత్తులు పూర్తి చేసేందుకు అతడికి సమయం తగ్గిపోయింది. అయినప్పటికీ ఒత్తిడిని అధిగమించి గేమ్‌ను డ్రాగా ముగించాడు.

14 గేమ్‌లలో ఎవరిది పైచేయి?

ఈ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం 14 గేమ్‌లు జరగనున్నాయి. మొదట 7.5 పాయింట్లు సాధించిన ఆటగాడు ప్రపంచ ఛాంపియన్‌గా నిలుస్తాడు. తొలి గేమ్ డ్రా కావడంతో ఇద్దరికీ చెరో అర పాయింట్ లభించింది. రెండో గేమ్ బుధవారం జరగనుంది. రాబోయే గేమ్‌లలో ఎవరు ఆధిపత్యం ప్రదర్శిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *