కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు తాగునీటి పైప్‌లైన్ ధ్వంసం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలించిన సీఎం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో తక్షణమే నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎంఓ అధికారులు కడప జిల్లా యంత్రాంగాన్ని సమగ్ర నివేదిక కోరారు. అక్రమ ఇసుక తవ్వకాలతో పాటు ప్రజలకు తాగునీరు అందించే పైప్‌లైన్‌ను ధ్వంసం చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినా అక్రమ మైనింగ్‌కు పాల్పడినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

సీఎంఓ ఆదేశాలతో స్పందించిన కడప జిల్లా కలెక్టర్ ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించారు. ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లి వద్ద అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించిన వెంటనే గ్రామ పంచాయతీ కార్యదర్శి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. దీంతో అధికారులు తక్షణమే స్పందించి అక్రమ తవ్వకాలు ఇసుక రవాణాను నిలిపివేశారని వివరించారు.

అక్రమ ఇసుక రవాణాకు ఉపయోగించిన ట్రాక్టర్లు, వాటి యజమానులు ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వ్యక్తుల వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తాగునీటి పైప్‌లైన్‌ను ధ్వంసం చేసిన నిందితులు ట్రాక్టర్ యజమానులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

మరోవైపు ధ్వంసమైన తాగునీటి పైప్‌లైన్‌కు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించినట్లు కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అక్రమ ఇసుక తవ్వకాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయడంతో పాటు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టం చేసింది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *