రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో తాడిపత్రితో పాటు యల్లనూరు మండలంలో విద్యావంతులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించామని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తన పిలుపుతో సుమారు 50 శాతం మంది విద్యావంతులు ఎన్నికల బరిలో నిలిచారని వెల్లడించారు.

గ్రామాల్లో ఫ్యాక్షన్ సంస్కృతికి స్వస్తి పలికి ప్రశాంత వాతావరణం నెలకొల్పినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఏడాదిలోగా తాను ఆశించిన మార్పు కనిపించకపోతే అందరితో రాజీనామాలు చేయిస్తానని స్పష్టం చేశారు. బుధవారం తాడిపత్రిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే వ్యవస్థలో నిజమైన మార్పు వస్తుందని జేసీ అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఫ్యాక్షన్ రాజకీయాల వల్లే అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. గతంలో రాజకీయ వర్గాల మధ్య ఘర్షణలు, రిగ్గింగ్‌లు, ఇళ్లపై దాడులు బాంబు దాడులు జరిగేవని గుర్తుచేశారు.

ఇప్పుడు వాహనాలకు నిప్పు పెట్టే ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. ఇలాంటి సంస్కృతికి స్వస్తి పలికి ప్రజలంతా ప్రశాంతంగా జీవించాలని పిలుపునిచ్చారు. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు కర్నూలు, పులివెందుల ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి చెందిన పలువురు ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని వ్యాఖ్యానించారు.

అయితే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప జిల్లాకు, ముఖ్యంగా పులివెందులకు గణనీయమైన అభివృద్ధి చేశారని ప్రస్తావించారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని జేసీ స్పష్టం చేశారు. అవసరమైతే వైసీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి కూడా అభివృద్ధి పనులపై చర్చిస్తానని అన్నారు. యాడికి మండలంలో ఎర్రబాబు బొంబాయి రమేష్ వంటి నాయకులు సహకరిస్తున్నారని పెద్దవడుగూరు, పెద్దపప్పూరు మండలాల్లోనూ నాయకుల నుంచి మద్దతు లభిస్తోందని తెలిపారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *