
చిత్తూరు జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కుప్పం పలమనేరు నియోజకవర్గాల పరిధిలోని తొమ్మిది మండలాల్లో గురువారం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 182 గ్రామ పంచాయతీలు, 1,908 వార్డు స్థానాలకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమిత్‌కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు.
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత ఐదు సర్పంచ్ స్థానాలు 712 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 177 సర్పంచ్ స్థానాలకు 494 మంది అభ్యర్థులు 1,196 వార్డు స్థానాలకు 2,482 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటించడంతో పాటు ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. అనివార్య కారణాలతో ఎక్కడైనా ఎన్నికలు వాయిదా పడితే శుక్రవారం పోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా బుధవారం ఉదయం 7 గంటల నుంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలైన ఎంపీడీవో కార్యాలయాలు జడ్పీ ఉన్నత పాఠశాలల నుంచి ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రారంభం కానుంది.
పోలింగ్ అధికారులకు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర అవసరమైన సామగ్రిని అందజేయనున్నారు. ఇందుకోసం అధికారులు రూట్లు, జోన్లను ఇప్పటికే గుర్తించారు. సర్పంచ్ ఎన్నికలకు పింక్ రంగు బ్యాలెట్ పేపర్లు వార్డు సభ్యుల ఎన్నికలకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేశారు. సర్పంచ్ బ్యాలెట్ పేపర్‌పై 25 గుర్తులు వార్డు బ్యాలెట్ పేపర్‌పై పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను బట్టి గరిష్ఠంగా 20 గుర్తులు ముద్రించారు.
జిల్లాలోని 1,581 పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నారు. పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు కలెక్టర్ సుమిత్‌కుమార్ 1,700 మంది పీవోలు, ఏపీవోలు, ఓపీవోలను నియమించారు. స్టేజ్-2 అధికారుల పర్యవేక్షణలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు.




