
అమరావతి, సముద్రంలో చేపల వేటకు వెళ్లిన కాకినాడ జిల్లా ఏటిమొగకు చెందిన ఏడుగురు మత్స్యకారులు బోటు ఇంజిన్ పనిచేయకపోవడంతో సముద్రంలో చిక్కుకుపోయారు. అయితే వారంతా క్షేమంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.
ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో కృష్ణాపురం సమీపంలో తీరానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో బోటు నిలిచిపోయిందని మంత్రి తెలిపారు. సమాచారం అందిన వెంటనే అధికారులు స్పందించి కోస్ట్‌గార్డ్, నౌకాదళాన్ని అప్రమత్తం చేయడం అభినందనీయమన్నారు.
మరో బోటు సహాయంతో ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా తీరానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. సంబంధిత అధికారులు సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
సుబ్బంపేట మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు
మరోవైపు కాకినాడ జిల్లా సుబ్బంపేటకు చెందిన గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. వారి రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ రాసినట్లు వెల్లడించారు.
కోస్ట్‌గార్డ్, భారత నౌకాదళం, ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గల్లంతైన మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు.




