టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ నివేదికలో పార్టీ ఆస్తుల వివరాలు వెల్లడయ్యాయి. 2026 మార్చి 31 నాటికి టీడీపీ మొత్తం ఆస్తుల విలువ రూ.526 కోట్లుగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఇందులో రూ.412 కోట్లు బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఉండగా, మరో రూ.115 కోట్ల మేర ఇతర ఆస్తులు ఉన్నాయి. పార్టీ ప్రతి ఏటా మహానాడు వేదికగా తన ఆదాయ, వ్యయాల వివరాలను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో 2026 మేలో నిర్వహించిన మహానాడులోనూ పార్టీ ఆర్థిక లావాదేవీల వివరాలను వెల్లడించింది.

దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు తమకు అందిన విరాళాలు, ఆస్తుల వివరాలను ప్రతి ఏటా ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తెలుగురాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు కూడా ఏటా తమ ఆర్థిక వివరాలను ఈసీకి అందజేస్తున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ నివేదికలో పార్టీ ఆస్తుల వివరాలు వెల్లడయ్యాయి.

2026 మార్చి 31 నాటికి టీడీపీ మొత్తం ఆస్తుల విలువ రూ.526 కోట్లుగా ఉన్నట్లు ఆడిట్ నివేదిక పేర్కొంది. అయితే, గత ఏడాదితో పోలిస్తే పార్టీ ఆదాయం 60.29 శాతం తగ్గినట్లు వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఆస్తుల విలువ సుమారు రూ.50 కోట్లు పెరిగింది. మొత్తం ఆస్తుల్లో రూ.412 కోట్లు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. భూములు, భవనాల రూపంలో రూ.63.35 కోట్ల ఆస్తులు ఉండగా, రుణాలు, అడ్వాన్సుల రూపంలో మరో రూ.51.37 కోట్లు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

గత ఏడాదితో పోలిస్తే తెలుగుదేశం పార్టీ ఆదాయం గణనీయంగా తగ్గింది. 2024-25లో సుమారు రూ.228 కోట్లుగా ఉన్న ఆదాయం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.90.64 కోట్లకు పడిపోయింది. 2026 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో టీడీపీకి మొత్తం రూ.90.64 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆడిట్ నివేదిక వెల్లడించింది. ఇందులో ఫీజులు, విరాళాల రూపంలో రూ.1.67 కోట్లు, స్వచ్ఛంద విరాళాల ద్వారా రూ.58.33 కోట్లు వచ్చాయి. బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ, ఇతర ఆదాయ మార్గాల ద్వారా మరో రూ.30.63 కోట్లు సమకూరాయి.

మరోవైపు పార్టీ ఖర్చుల్లో కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేసింది. గతంలో కార్యకర్తల గ్రూప్ ఇన్సూరెన్స్ కోసం రూ.15.84 కోట్లు ఖర్చు చేయగా.. తాజాగా ఈ మొత్తాన్ని రూ.46.25 కోట్లకు పెంచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో పార్టీ మొత్తం రూ.74.28 కోట్లు వ్యయం చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో రూ.16.52 కోట్లు ఎన్నికల ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ, ఇతర అవసరాల కోసం వెచ్చించారు. కార్యకర్తల గ్రూప్ ఇన్సూరెన్స్‌కు రూ.46.25 కోట్లు కేటాయించారు. ఆర్థిక వ్యయాల కింద రూ.1.40 కోట్లు, తరుగుదల కింద రూ.4.26 కోట్లు ఖర్చయ్యాయి.

అన్ని ఖర్చులు పోగా మిగిలిన రూ.16.35 కోట్లను పార్టీ జనరల్ ఫండ్‌లో జమ చేసినట్లు ఆడిట్ నివేదిక వెల్లడించింది. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి ఉన్న రూ.469.42 కోట్ల నిల్వను తదుపరి ఆర్థిక సంవత్సరానికి ప్రారంభ నిల్వగా బదిలీ చేసినట్లు పేర్కొంది.

దేశంలోని రాజకీయ పార్టీలకు వివిధ మార్గాల ద్వారా విరాళాలు అందుతుంటాయి. ఈ విరాళాలతో పాటు పార్టీ ఆదాయ, వ్యయాలు, ఆస్తుల వివరాలను ప్రతి ఏటా ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ప్రైవేటు సంస్థలు, ఇతర దాతల నుంచి విరాళాలు అందుతున్నాయి. అలాగే పార్టీ ఏటా నిర్వహించే మహానాడు కార్యక్రమంలోనూ నేతలు విరాళాలు అందజేస్తుంటారు. ఈ సందర్భంగా మహానాడు వేదిక నుంచి పార్టీకి సంబంధించిన వార్షిక ఆదాయ, వ్యయాల వివరాలను అధికారికంగా ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా 2026 మే నెలలో నిర్వహించిన మహానాడులోనూ టీడీపీ ఆర్థిక లావాదేవీల వివరాలను వెల్లడించారు. పార్టీ సీనియర్ నేత, ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జమాఖర్చుల వివరాలను ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పార్టీకి మొత్తం రూ.90.64 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఇందులో విరాళాల రూపంలో రూ.58.32 కోట్లు సమకూరగా, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ ద్వారా రూ.29.10 కోట్లు వచ్చాయి. పార్టీ సభ్యత్వ నమోదు ద్వారా రూ.1.62 కోట్లు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా మరో రూ.1.52 కోట్లు సమకూరినట్లు మహానాడు వేదికగా వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *