
పారిశ్రామిక రంగంలో వెనుకబడి ఉన్న జిల్లాలో సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. స్థానికంగా భూముల కొరత ఉన్నప్పటికీ ప్రతి నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
ఇందులో భాగంగా జిల్లాలో రెండు ప్రాంతాల్లో నిర్మిస్తున్న పారిశ్రామిక పార్కులను జనవరిలో అందుబాటులోకి తీసుకురావాలని పరిశ్రమల శాఖ కసరత్తు చేస్తోంది. ఈ రెండు పార్కుల్లోనూ ఒక్కొక్కటిలో 24 చొప్పున మొత్తం 48 షెడ్లు నిర్మిస్తున్నారు. ప్రతి షెడ్లో ఒక సూక్ష్మ పరిశ్రమను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
ఆసక్తి ఉన్న పారిశ్రామికవేత్తలకు నెలవారీ అద్దె ప్రాతిపదికన షెడ్లను లీజుకు ఇవ్వనున్నారు. చదరపు అడుగుకు రూ.29 అద్దె ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. విస్సాకోడేరులో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం 9.78 ఎకరాలు కేటాయించింది. ప్రస్తుతం 2.16 ఎకరాల్లో షెడ్ల నిర్మాణంతో పాటు రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపడుతున్నారు.
మరోవైపు నరసాపురం మండలం లిఖితపూడిలో 11.54 ఎకరాల విస్తీర్ణంలో రూ.4.35 కోట్ల వ్యయంతో 24 షెడ్లను నిర్మిస్తున్నారు. ఈ రెండు పార్కులను జనవరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లోనూ పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి.
అయితే భూముల లభ్యత ప్రధాన సమస్యగా మారింది. దీంతో ప్రైవేటు భూయజమానులు పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో పార్కులు ఏర్పాటు చేసి వాటిని లీజుకు లేదా విక్రయించే విధానంపై అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు జిల్లాలోని పారిశ్రామికవేత్తలు భూయజమానులతో సమావేశాలు నిర్వహించినప్పటికీ ఆశించిన స్పందన లభించలేదు.
ప్రైవేటు భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.




