ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదాలు తోపులాటలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ బూత్‌ల వద్ద ప్రచారం చేస్తున్నారంటూ ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో వివాదాలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఎన్టీఆర్ జిల్లాలో వాగ్వాదాలు, తోపులాటలు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం గణపవరంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రం సమీపంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని కార్యకర్తలను చెదరగొట్టారు. ఇదే జిల్లాలోని గుర్రాజుపాలెం పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

శ్రీకాళహస్తిలో దొంగ ఓట్ల ఆరోపణలు

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మున్సిపాలిటీలోని 15వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ వైసీపీ కార్యకర్తలను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

విజయవాడ యనమలకుదురులో రచ్చ

విజయవాడలోని యనమలకుదురులోనూ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలింగ్ బూత్‌ల సమీపంలో ప్రచారం చేస్తున్నారంటూ ఇరు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని కార్యకర్తలను పోలింగ్ కేంద్రాలకు దూరంగా పంపించారు.

నరసరావుపేటలో ఉద్రిక్తత పోలీసుల లాఠీఛార్జ్

పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని జొన్నలగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి పిలుపు మేరకు వైసీపీ మహిళలు పోలింగ్ కేంద్రాల వద్ద గుమిగూడినట్లు ఆరోపణలు వచ్చాయి. కారం పొట్లాలతో సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో జొన్నలగడ్డలో పోలీసులపై కొందరు వైసీపీ కార్యకర్తలు తిరగబడటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించారు.

నంద్యాల జిల్లాలో ఘర్షణ గంటపాటు పోలింగ్ నిలిపివేత

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం జంబులదిన్నెలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో అధికారులు సుమారు గంటపాటు పోలింగ్‌ను నిలిపివేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బిజయేంద్రరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇదే జిల్లాలోని పోరుమామిళ్ల మండలం గానుగుపెంట పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం తోపులాట జరిగాయి.

బ్యాలెట్ పేపర్లలో గుర్తులు మార్పు మరోచోట దొంగ ఓట్ల కలకలం

అయ్యప్పరాజుపాలెం పోలింగ్ బూత్‌లో బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల గుర్తులు మారిపోయినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ పేపర్లను మార్చి పోలింగ్‌ను తిరిగి ప్రారంభించారు.

ఇక బి.కొత్తకోట పంచాయతీ ఎన్నికల్లోనూ దొంగ ఓట్ల ఆరోపణలు కలకలం రేపాయి. ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులు వస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

మొత్తంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న వివాదాలతో ఎన్నికల పోలింగ్ సమయంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *