
దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన భారీ యంత్రాల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం రూ.11,000 కోట్లను కేటాయిస్తూ కొత్త కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎనిమిదేళ్ల పాటు అమలయ్యే ఈ పథకం ద్వారా నిర్మాణ రంగానికి అవసరమైన యంత్రాలను దేశీయంగానే తయారు చేసే సంస్థలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించనున్నారు.
భారీ యంత్రాల తయారీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు
దేశంలో రహదారులు, పోర్టులు, గృహ నిర్మాణం, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో నిర్మాణ, మౌలిక వసతుల రంగాల్లో భారీ యంత్రాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ రంగం పరిమాణం 2024-25లో రూ.97,500 కోట్లుగా ఉండగా.. 2029-30 నాటికి రూ.2.28 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నౌకల నుంచి సరకు దించేందుకు ఉపయోగించే క్రేన్లు, సొరంగాలు తవ్వే యంత్రాలు, హైడ్రాలిక్ ఎక్స్కవేటర్లు, ఆఫ్-హైవే ట్రక్కులు, లోడర్లు, పైలింగ్ రిగ్గులు, డ్రిల్లింగ్ యంత్రాలను దేశంలోనే తయారు చేసేలా ప్రోత్సహించనున్నారు. ఆయా యంత్రాల విక్రయాల ఆధారంగా 8 నుంచి 13 శాతం వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తారు. యంత్రాల నాణ్యత, పనితీరును పరీక్షించే సదుపాయాల ఏర్పాటుకు రూ.375 కోట్ల గ్రాంటు కేటాయించనున్నారు.
ఈ పథకం ద్వారా సుమారు రూ.21,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. ఎనిమిదేళ్లలో రూ.22,500 కోట్ల విలువైన దిగుమతులు తగ్గే అవకాశం ఉందని భావిస్తోంది.
పోస్టల్ శాఖ ఆధునికీకరణకు రూ.2,632 కోట్లు
తపాలా శాఖను ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు రూ.2,632 కోట్ల నిధులతో చేపట్టనున్న ప్రణాళికకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో రూ.1,141 కోట్లతో 2030-31 నాటికి దేశవ్యాప్తంగా పోస్టల్ కార్యకలాపాల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తారు. మరో రూ.1,491 కోట్లను మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించనున్నారు.
తపాలా శాఖకు చెందిన ఖాళీ స్థలాల్లో 190 కొత్త భవనాలను నిర్మించనున్నారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న పోస్టాఫీసులను వీటిలోకి తరలిస్తారు. అలాగే బెంగళూరులో శాశ్వత సమీకృత సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
కామరాజ్ పోర్టులో రెండో కంటెయినర్ టెర్మినల్
తమిళనాడులోని కామరాజ్ పోర్టు అభివృద్ధికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (PPP) విధానంలో 111 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,288 కోట్లతో రెండో కంటెయినర్ టెర్మినల్‌ను నిర్మించేందుకు అనుమతి ఇచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హోసూరు, బెంగళూరు, శ్రీసిటీ, తిరుపతి పారిశ్రామిక ప్రాంతాల్లో తయారయ్యే ఉత్పత్తుల ఎగుమతులకు మరింత సౌలభ్యం కలగనుంది.
సిల్చార్‌లో కొత్త విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్
ఈశాన్య రాష్ట్రాల విమానయాన అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు అస్సాంలోని సిల్చార్‌లో కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. సుమారు రూ.2,014 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. దీనివల్ల బారక్ లోయతో పాటు చుట్టుపక్కల ఈశాన్య ప్రాంతాలకు విమాన కనెక్టివిటీ మెరుగుపడుతుంది. పర్యాటక రంగం, వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఈ విమానాశ్రయం ఊతమిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.



