నంద్యాల జిల్లా అహోబిలంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రయాణిస్తున్న కారుపై దాడి జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో ఆమె కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. దీంతో అఖిలప్రియ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

ఘటనపై స్పందించిన ఆమె పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన జరిగే అవకాశం ఉందని ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చినా, తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ముందస్తు హెచ్చరికలను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. అయితే ఈ ఘర్షణకు సంబంధించి వైసీపీ నేతల వాదన మరోలా ఉంది. దీంతో అహోబిలంలో చోటుచేసుకున్న ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నంద్యాల జిల్లా అహోబిలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రయాణిస్తున్న కారుపై దాడి జరగడంతో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడి జరిగినట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి ఘర్షణను నియంత్రించారు. జిల్లా ఎస్పీతోపాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా అహోబిలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అహోబిలంలో అసలేం జరిగింది?

గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న సమయంలో అహోబిలం వద్ద టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య మొదట వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కారు వైసీపీ మద్దతుదారులపైకి దూసుకొచ్చిందని ఆ పార్టీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, వైసీపీ కార్యకర్తలే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కారుపై దాడికి పాల్పడ్డారని ఆమె వర్గం ప్రత్యారోపణలు చేస్తోంది.

ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే అఖిలప్రియ కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడటంతో ఆయనను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురైన భూమా అఖిలప్రియ ఘటనా స్థలంలోనే కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం అహోబిలంలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.

ఘటనతో తీవ్ర భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అహోబిలంలో జరిగిన దాడికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని వారం రోజుల ముందే పోలీసులకు సమాచారం ఇచ్చామని, అయినప్పటికీ వారు ముందస్తు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఇంతటి ఘటన చోటుచేసుకుందని విమర్శించారు. పోలీసుల సమక్షంలోనే వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతుంటే ఏం చేయాలని ఆమె ప్రశ్నించారు.

వైసీపీ వర్గీయుల ఆరోపణలు మరోలా..

మరోవైపు ఈ ఘటనపై వైసీపీ వర్గీయులు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రయాణిస్తున్న కారు తమ పార్టీ మద్దతుదారులపైకి దూసుకొచ్చిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా, వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇలా ఇరు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండటంతో అహోబిలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో రాజకీయ ఘర్షణలు చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *