
తెలంగాణలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ముఖ్యమైన గమనిక. రాష్ట్ర ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి గడువును మరో నెల పొడిగించింది. ఈ-కేవైసీ గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్టు పౌరసరఫరాలశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే మూడు నెలల రేషన్ ఒకేసారి తీసుకోవాలని సూచించారు. రేషన్ కార్డు ఈ-కేవైసీ ప్రక్రియ పెండింగ్ ఉన్నవారు వెంటనే పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాలశాఖ అధికారులు కోరుతున్నారు.
తెలంగాణలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం ఊరట కల్పించింది.. రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కారణంగా ఆగస్టు 31 వరకు రేషన్ ఈ-కేవైసీ గడువును పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ-కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఆగస్టు 1 నుంచి 31 వరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పొందే అవకాశం కల్పించింది. రేషన్ కార్డులు ఉన్నవారు ఈ విషయాన్ని గమనించాలని పౌరసరఫరాలశాఖ అధికారులు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులో పేరున్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని పౌర సరఫరాల శాఖ సూచిస్తోంది. రేషన్‌కార్డు ఉన్నవారు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఈ-కేవైసీని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రజలు దగ్గరలో ఉండే ఏ రేషన్ షాపులోనైనా వెళ్లి ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.. పూర్తిగా ఉచితం. ఎక్కడ రేషన్ కార్డు ఉంటే అక్కడే ఈ-కేవైసీ చేయించుకోవలనే ప్రచారాన్ని నమ్మొద్దని సూచిస్తున్నారు. వన్ నేషన్ – వన్ రేషన్ విధానం అమల్లోకి వచ్చాక దేశవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి దగ్గరలో ఉండే రేషన్ షాపులోనైనా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.
ఈ-కేవైసీపీ ప్రక్రియను వేలి ముద్ర, లేదా ముఖ గుర్తింపు ద్వారా కేవలం 10 సెకన్లలో పూర్తి చేస్తారు. ఒకవేళ బయోమెట్రిక్ సమస్యలు ఉంటే వెంటనే రేషన్ డీలర్, సంబంధిత పౌరసరఫరాల అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ నిలిపివేసే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఈ-కేవైసీ చేసుకోకపోతే సంక్షేమ పథకాలకు ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు. తెలంగాణలో శనివారం నుంచి మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది. రేషన్ కార్డులో ఒక్కో సభ్యుడికి 6 కిలోల చొప్పున మూడు నెలలకు 18 కిలోలు చొప్పున రేషన్ పంపిణీ చేస్తారు. ఈ-కేవైసీ గడువు పొడిగించిన విషయాన్ని గమనించి.. పెండింగ్ ఉన్నవారు వెంటనే పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

