
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రశాంతమైన స్వభావం గురించి మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన సమయంలో కేఎల్ రాహుల్ తీవ్ర నిరాశకు, కోపానికి గురవ్వడం చూశానని చెప్పాడు. గెలవాల్సిన మ్యాచ్‌లు చివరి ఓవర్లలో చేజారినప్పుడు రాహుల్ ముఖంలో తీవ్ర అసహనం కనిపించిందని పేర్కొన్నాడు. ప్రశాంతంగా ఉండే రాహుల్‌లో అంత కోపాన్ని చూడటం అదే తొలిసారని జాఫర్ వెల్లడించాడు.
భారత జట్టు వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో కేఎల్ రాహుల్, వసీం జాఫర్.. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కోసం కలిసి పనిచేశారు. అప్పుడు రాహుల్ ఆ జట్టుకు కెప్టెన్‌గా, జాఫర్ కోచ్‌గా ఉన్నారు. అయితే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే.. కేఎల్ రాహుల్‌లో తాను ఒక్కసారి కోపం చూశానని జాఫర్ వ్యాఖ్యానించాడు. అందుకు గల కారణాన్ని, సందర్భాన్ని సైతం వివరించాడు.
ఐపీఎల్లో రాహుల్ పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఇది జరిగిందని జాఫర్ చెప్పుకొచ్చాడు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లలో ఓడిపోవడం రాహుల్‌ను తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలిపాడు.
“కేఎల్ రాహుల్ సహజంగానే చాలా ప్రశాంతంగా ఉంటాడు. మైదానంలోనూ, బయటా ఎక్కువగా కోపం చూపించడం చాలా అరుదు. కానీ నేను పంజాబ్ కింగ్స్‌లో బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సమయంలో తొలిసారి అతడిలో కోపం చూశా. గెలవాల్సిన మ్యాచ్‌లను చివరి ఓవర్లలో కోల్పోయాం. ఇలాగే ఒక మ్యాచ్ ఓడిన తర్వాత అతడు తీవ్ర అసహనానికి గురయ్యాడు. అయినప్పటికీ అతడు హద్దులు దాటి ఏమీ మాట్లాడలేదు. కానీ జట్టు ఆటతీరుపై ఎంత నిరాశ చెందాడో అతడి ముఖంలో, మాటల ద్వారా అర్థమైంది. నేను కేఎల్ రాహుల్‌ను కోపంగా చూసిన ఏకైక సందర్భం అదే” అని వసీం జాఫర్ వెల్లడించాడు.

