
తిరుమల శ్రీవారికి కొంతకాలంగా భారీ విరాళాలు అందుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రస్టులకు భక్తులు విరాళాలు ఇస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మరో భక్తుడు టీటీడీకి భారీ విరాళం ఇచ్చారు. ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున సీతారామ్ రెడ్డి అండ్ ఫ్యామిలీ రూ.2 కోట్లు శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు విరాళంగా టీటీడీ అడిషనల్ ఈవోకు అందించింది.
తిరుమల శ్రీవారిని నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు.. అనంతరం స్వామివారికి తమకు తోచిన విధంగా కానుకలు, విరాళాలు అందిస్తుంటారు. శ్రీవారి పేరుతో నడిచే ట్రస్టులకు కొందరు భక్తులు భారీగా విరాళాలు అందిస్తున్నారు.. గత రెండేళ్లుగా స్వామివారికి ఈ విరాళాలు అందుతున్నాయి. టీటీడీ కూడా భక్తులు అందించే విరాళాలను బట్టి దర్శనం, వసతి గది సహా పలు సదుపాయాలు కల్పిస్తోంది. టీటీడీకి సామాన్య భక్తులతో పాటుగా ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రైవేట్ సంస్థలు కూడా విరాళాలు అందిస్తున్నాయి. తాజాగా తిరుమల శ్రీవారికి మరో భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు.
హైదరాబాద్‌కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.2 కోట్లు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థకు చెందిన దాతలు ఆర్ సీతారామ్ రెడ్డి, జి కవిత, త్రినయ్ రెడ్డి, త్రిభువన్ రెడ్డిలు కలిసి తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ అడిషనల్ ఈవో అభినందించారు. అంతేకాదు టీటీడీ ఇటీవల వివిధ ట్రస్టులు, స్కీమ్‌లకు విరాళాలు అందించే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్‌లో పలు మార్పులు చేసిన సంగతి తెలిసిందే.
టీటీడీ ఆధ్వర్యంలోని కార్వేటినగరం శ్రీ రుక్మిణీ–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 25 నుంచి 27వ తేదీ వరకు భక్తి పారవశ్యాన్ని పంచే శ్రీ స్వామివారి తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. తెప్పోత్సవాల్లో భాగంగా ఆగస్టు 25న శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, ఆగస్టు 26, 27 తేదీల్లో శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారు రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు పుష్కరిణిలో అలంకరించిన తెప్పపై విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు. మూడు రోజుల పాటు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

