
ఏపీలో గురువారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.. మధ్యాహ్నం వరకు ఎండలు, ఆ తర్వాత ఉన్నట్టుండి వర్షాలు పడ్డాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా వానలు కురిశాయి. విశాఖపట్నంలో గురువారం రాత్రి వరకు భారీ వర్షాలు పడ్డాయి. అలాగే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశాపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. శుక్రవారం, శనివారం వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయంటున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయంటున్నారు. వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతరామరాజు,డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. అలాగే మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వానలు కురుస్తాయంటున్నారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సమయంలో చెట్లు, పోల్స్ , హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. గురువారం శ్రీకాకుళం జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు.. కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీ వానలు పడతాయంటున్నారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఏలూరు, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే ఈ నెల 14న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగింది. వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా మధ్యాహ్నం తర్వాత ఉత్తరాంధ్రలో ఈదురుగాలులతో వర్షం పడింది. విశాఖపట్నంజిల్లా బుచ్చిరాజుపాలెంలో 9.17 సెంటీమీటర్లు, మహారాణిపేటలో 8.9 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 8.62 సెంటీమీటర్లు, పార్వతీపురం జిల్లా సాలూరులో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొన్నటి వరకు ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు సరిగా పడలేదు. కొద్దిరోజులుగా వర్షాలు కురవడంతో రైతులకు కాస్త ఊరట దక్కింది. ఈ వర్షాలు సరిపోవని కూడా అంటున్నారు.. ఈ నెలలో అల్పపీడనం ఏర్పడుతుందనే అంచనాలపై ఆశలు పెట్టుకున్నారు.

