
చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 71,636 చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ. 25 వేల ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా రూ. 179 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చినట్లు ఈ సందర్భంగా చేనేతలకు గుర్తు చేశారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతన్న సేవలో పథకానికి శ్రీకారం చుట్టారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి రూ. 25 వేల ఆర్థిక సాయం అందజేస్తున్నామని.. రాష్ట్రంలోని 71,636 చేనేత కుటుంబాలకు పథకం వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా రూ. 179 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చేనేత కార్మికులంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని.. చీరాలకు రావడం తన అదృష్టమన్నారు. చేనేత కార్మికుల కష్టాలు తనకు తెలుసని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేతల కోసం తాను పోరాటం చేశానని చెప్పారు.
చీరాల చేనేతకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని.. చీరాలకు రావడం తన అదృష్టమని ముఖ్యంత్రి అన్నారు. చీరాల పట్టు, కాటన్ చీరలకు విశేష ఆదరణ ఉందని చెప్పారు. ఒకప్పుడు చీరాల కర్చీఫ్‌లు విదేశాలకు ఎగుమతి అయ్యేవని గుర్తు చేశారు. చేనేత కేవలం వృత్తి కాదని.. భారతీయ సంస్కృతికి ప్రతీక అని కొనియాడారు. దేశం గర్వించే కళ చేనేత అని అభివర్ణించారు.
చీరాల, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, శ్రీకాకుళం, మంగళగిరి, పొందూరు, పెడన, నరసాపురం చేనేత ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. చేనేత రంగం కాలక్రమేణ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని, చేనేత వైభవాన్ని మళ్లీ తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు వరకూ చేనేత రంగ అభివృద్ధికి, నేతన్న సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. చేనేతలకు 50 ఏళ్ల వయస్సలోనే పింఛన్ ఇచ్చిన నాయకుడు కూడా చంద్రబాబే అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు.

