
ఆంధ్రప్రదేశ్‌లో వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. గురువారం నుంచి వర్షాలు మొదలవుతాయని.. ఏపీలో మాత్రం వచ్చే సోమవారం నుంచి శనివారం వరకు వర్షాలు పడతాయంటున్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు పడ్డాయి.. అక్కడ వర్షాలతో పాటుగా పిడుగులు కూడా పడ్డాయి. మందస ప్రాంతంలో పిడుగు పడి ఇద్దరు చనిపోయారు.. మరికొందరికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. నేటి వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఆదివారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వానలు కురిశాయి. నేడు పలు జిల్లా్ల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు ఉత్తర బంగాళాఖాతాన్ని ఆనుకుని పశ్చిమబెంగాల్ తీరప్రాంతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తుంది. ఈ ప్రభావంతో సోమవారం నుంచి శనివారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. గురువారం నుంచి జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బిహార్‌లో వానలు పడతాయంటున్నారు. ఎల్‌నినో కారణంగా రాష్ట్రంపై అల్పపీడనాలు పెద్దగా ప్రభావం చూపటం లేదు. ఇటీవల ఏర్పడిన అల్పపీడనాలతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు మాత్రమే పడ్డాయి.
శ్రీకాకుళం జిల్లాకు ఆదివారం రోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.. పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడ్డాయి. ఆదివారం రోజు జిల్లాలోని మందస మండలం బుడార్శింగి పంచాయతీలోని కళింగదళ్ జలాశయం దిగువ ప్రాంతంలో పెడంగొకు చెందిన ఓ రైతు పొలంలో ఆరుగురు పనుల కోసం వచ్చారు. అయితే సాయంత్రం 5 గంటల సమయంలో పిడుగు పడటంతో సుముద్రి, జొరా అనే ఇద్దరు కూలీలు చనిపోయారు.. మిగిలిన నలుగురికి గాయలయ్యాయి. వీరిలో పెర్మి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హరిపురం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన సుముద్రి భర్త భాస్కరరావు, పెద్ద కుమార్తె రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. చిన్న కుమార్తె పదో తరగతి చదువుతోంది.. పాపం ఆ బాలిక అనాథ అయ్యింది. జొరా భర్తకు కంటిచూపులేదు.. వీరికి 18 ఏళ్లు కుమార్తె ఉండగా.. ఆమె మానసిక దివ్యాంగురాలు.
శ్రీకాకుళం జిల్లా పలాసలో 4.4 సెంటీమీటర్లు, కడప జిల్లా దువ్వూరులో 4.2, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 4, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో 3.8, గుంటూరు జిల్లా తెనాలి 3.6, శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ 3.5, శ్రీకాకుళం జిల్లా రణస్థలం 3.2, శ్రీకాకుళం జిల్లా మందసలో 3.2, గుంటూరు జిల్లా లంలో 3.2, కడప జిల్లా రాజుపాలెంలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

