
వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఏపీలో మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
తెలంగాణలో హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జనగామ, మహబూబాబాద్, నల్గొండ, నాగర్కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
వర్షాలు, పిడుగులు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించారు.

