
ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ప్రాణాలు కోల్పోయే భద్రతా సిబ్బంది కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా కల్పించేలా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అమరవీరుల కుటుంబాలకు అందించే ఎక్స్‌గ్రేషియా, ఇతర పరిహారాలను సవరించింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ప్రాణాలు కోల్పోయే స్థానిక జవాన్ల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను ఏకంగా రూ.25 లక్షలకు పెంచారు. అలాగే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే పోలీసు సిబ్బంది కుటుంబాలకు రూ.12 లక్షల పరిహారం అందించనున్నారు.
ఇవే కాకుండా.. విధుల్లో ప్రాణాలు కోల్పోయే ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, ఉగ్రవాద దాడుల్లో దెబ్బతినే ఆస్తులకు కూడా సవరించిన పరిహారాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. కొత్త నిబంధనల్లో ఎవరికి ఎంత పరిహారం లభిస్తుంది? ఏయే పరిస్థితుల్లో ఈ ఆర్థిక సాయం అందుతుంది? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భద్రతా బలగాల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఉగ్రవాద ఘటనల కారణంగా ప్రభావితమయ్యే సామాన్య పౌరులకు కూడా మరింత ఆర్థిక అండ అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
భద్రతా సంబంధిత వ్యయం కింద అందించే ఎక్స్‌గ్రేషియా, నష్టపరిహారానికి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం సమూలంగా సవరించి, కొత్త మార్గదర్శకాలను అధికారికంగా నోటిఫై చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం.. విధి నిర్వహణలో వీరమరణం పొందే డిఫెన్స్, పారామిలటరీ సిబ్బంది కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించనున్నారు. అదే విధంగా ప్రాణాలు కోల్పోయే పోలీసు సిబ్బంది కుటుంబాలకు రూ.12 లక్షల నష్టపరిహారం ఇవ్వనున్నారు.
భద్రతా సిబ్బంది కుటుంబాలకే కాకుండా ఉగ్రవాద ఘటనల్లో నష్టపోయే పౌరులు, ఆస్తులకు కూడా సవరించిన పరిహారం వర్తించనుంది. కొత్త మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పులు చేశారు? ఎవరెవరికి ఎంత పరిహారం అందుతుంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సైనికులు, పారామిలటరీ బలగాలకు రూ.25 లక్షలు
ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, సరిహద్దు విధుల్లో ప్రాణాలు కోల్పోయే జవాన్ల కుటుంబాలకు అందించే పరిహారంపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన డిఫెన్స్ లేదా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) సిబ్బంది ఉగ్రవాద సంబంధిత ఘటనల్లో వీరమరణం పొందితే వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు.
ఈ పరిహారం ఘటన జమ్మూ కాశ్మీర్‌లో జరిగినా, రాష్ట్రం వెలుపల జరిగినా వర్తిస్తుంది. అయితే జమ్మూ కాశ్మీర్‌కు స్థానికేతరులైన డిఫెన్స్, CAPF సిబ్బంది అక్కడి భౌగోళిక పరిధిలో జరిగిన ఉగ్రవాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోతే.. వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందుతుంది.
కొత్త నిబంధనలతో స్థానిక జవాన్ల కుటుంబాలకు గతంతో పోలిస్తే మరింత ఆర్థిక భరోసా లభించనుంది.

