
నిశ్చితార్థం రద్దు చేసుకుందన్న కోపంతో ఓ యువతిని యాసిడ్‌తో దాడి చేస్తానని, చంపేస్తానని బెదిరించిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. వనస్థలిపురంలో నివసించే 33 ఏళ్ల యువతి ఓ బీమా కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తిరుపతికి చెందిన అంబావారి వంశీ అనే యువకుడు ఆమెకు డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యాడు. రొమ్ము క్యాన్సర్‌కు మందులు అభివృద్ధి చేసేందుకు అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏర్పాటు చేయాలని ఉందని నమ్మించి, ఆమె నుంచి రూ.15 లక్షలు తీసుకున్నట్లు యువతి ఆరోపించారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. అనంతరం కట్నం మొత్తాన్ని అడ్వాన్స్‌గా చెల్లించాలని వంశీ యువతిని వేధించడంతో ఆమె ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.
నిశ్చితార్థం రద్దు కావడంతో ఆగ్రహానికి గురైన వంశీ.. యువతి డ్రగ్స్‌కు బానిసైందని, ఆమె సోదరుడు ఉగ్రవాదులకు డబ్బులు సమకూరుస్తాడని ఆరోపిస్తూ ఆమె పనిచేసే కార్యాలయానికి ఈమెయిల్స్ పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, బయట కనిపిస్తే యాసిడ్ పోస్తానని లేదా చంపేస్తానని బెదిరించినట్లు తెలిపారు. దీంతో భయపడిన యువతి ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా జంకుతున్నట్లు పోలీసులకు వెల్లడించారు.
జూన్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వేధింపులు ఆగలేదని యువతి వాపోయారు. ఈ నెల 4న తనను యువతి బెదిరిస్తోందంటూ వంశీ తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆమెపై కేసు నమోదైంది. తన వాదన వినకుండానే తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ యువతి ఆగస్టు 5న వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు వంశీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

