
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళలు స్వయం ఉపాధి పొందేలా ఎలక్ట్రిక్ ఈ-ఆటోల కొనుగోలుపై భారీ రాయితీ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకంలో భాగంగా ఒక్కో ఈ-ఆటోపై రూ.లక్ష వరకు సబ్సిడీ అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే డ్వాక్రా మహిళలకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఈ-ఆటోల కొనుగోలుకు కూడా బ్యాంకు రుణ సదుపాయం కల్పించనుంది. రుణాన్ని సులభ వాయిదాల్లో తిరిగి చెల్లించే అవకాశం ఉండనుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం భావిస్తోంది.
ఒక్కో ఈ-ఆటో ధర సుమారు రూ.4.5 లక్షలు ఉండగా.. ప్రభుత్వం రూ.లక్ష రాయితీ అందిస్తుంది. దీంతో లబ్ధిదారులు సుమారు రూ.3.5 లక్షలకే ఈ-ఆటోను కొనుగోలు చేసుకోవచ్చు. మిగిలిన మొత్తానికి బ్యాంకు రుణం పొందే అవకాశం ఉంటుంది.
డ్వాక్రా సంఘాల సభ్యులు లేదా వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఈ-ఆటోను నడుపుతూ ఆదాయం పొందవచ్చు. తద్వారా కుటుంబానికి అదనపు ఆదాయంతో పాటు మహిళలకు ఆర్థిక స్వావలంబన లభించే అవకాశం ఉంది.
ఇప్పటికే కొందరు దరఖాస్తుదారులకు సబ్సిడీపై ఈ-ఆటోలు అందించినట్లు అధికారులు తెలిపారు. తాజాగా మరింతమంది డ్వాక్రా మహిళలకు ఈ ప్రయోజనం అందించేందుకు చర్యలు చేపట్టారు.
ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే ఆసక్తిగల డ్వాక్రా సంఘాలు మెప్మా అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

