
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. మహిళలు, యువతకు పెద్దపీట వేస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ నూతన టీమ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురికి కీలక బాధ్యతలు దక్కాయి. వారిలో ఇద్దరిని జాతీయ ఉపాధ్యక్షులుగా, మరొకరిని కో-ఆర్డినేటర్‌గా నియమించారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో భారీ సంస్థాగత మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ సోమవారం కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇందులో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీకి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది.
అదేవిధంగా 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాంమాధవ్, పురందేశ్వరితో పాటు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకురాలు వసుంధర రాజే సింధియాకు కూడా జాతీయ ఉపాధ్యక్షులుగా అవకాశం లభించింది.
అయితే తెలంగాణకు చెందిన నేతలకు కొత్త కార్యవర్గంలో చోటు దక్కలేదు. ఇప్పటివరకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగిన మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణను తాజా జాబితా నుంచి తప్పించారు.
బీజేపీ జాతీయ కార్యవర్గంలో పలు కీలక నియామకాలు చేపట్టారు. ఏపీకి చెందిన విష్ణువర్ధన్ రెడ్డిని జాయింట్ కో-ఆర్డినేటర్‌గా నియమించగా, కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్ బాధ్యతలను తరుణ్ చుగ్‌కు అప్పగించారు.
ఇక ఓబీసీ విభాగం అధ్యక్షుడిగా కొనసాగుతున్న లక్ష్మణ్‌ను తప్పించి, ఆయన స్థానంలో అమర్‌పాల్ మౌర్యను నియమించారు. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి బీజేపీలో చేరిన సందీప్ పాఠక్‌కు జాతీయ కార్యదర్శి పదవి కట్టబెట్టారు. మరోవైపు, సీనియర్ నేత సంబిత్ పాత్రాకు ఈశాన్య రాష్ట్రాల కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించారు.

