
న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ పరిధికి వెలుపల నిర్మించిన అక్రమ నిర్మాణాలను భారత అధికారులు గురువారం జేసీబీల సాయంతో తొలగించారు. వీసా విభాగం వెలుపల రహదారిపై ఏర్పాటు చేసిన భద్రతా బారికేడ్లు, క్యూ నిర్వహణ కోసం నిర్మించిన షెడ్లను అధికారులు కూల్చివేశారు.
ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ వద్ద పాకిస్థాన్ అధికారులు బారికేడ్లను తొలగించిన మూడు రోజులకే ఢిల్లీలో ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పాకిస్థాన్ చర్యకు ప్రతిస్పందనగానే భారత్ ఈ చర్యలు చేపట్టిందన్న ప్రచారం జరుగుతోంది.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ఎదుట గురువారం ఉదయం అధికారులు భారీ కూల్చివేత చర్యలు చేపట్టారు. హైకమిషన్‌కు కేటాయించిన నిర్ణీత పరిధిని దాటి రహదారిపై ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలు, క్యూ-మేనేజ్‌మెంట్ కోసం ఏర్పాటు చేసిన మౌలిక వసతులను యంత్రాంగం తొలగించింది.
ఆక్రమణల తొలగింపులో భాగంగా జేసీబీ యంత్రాలను రంగంలోకి దించిన అధికారులు.. హైకమిషన్ కాంపౌండ్ వెలుపల ఏర్పాటు చేసిన భద్రతా కటకటాలు, ట్రాఫిక్ బారికేడ్లను పూర్తిగా తొలగించారు. ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండా అకస్మాత్తుగా ఈ చర్యలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
భద్రతా ప్రాంగణంలోని నిర్మాణాలూ తొలగింపు..!
పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి చెందిన వీసా విభాగం వద్ద దరఖాస్తుదారుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు, క్యూ-మేనేజ్‌మెంట్ నిర్మాణాలు అనుమతించిన హద్దులను దాటి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో జేసీబీలతో చేపట్టిన కూల్చివేత చర్యల్లో భాగంగా వీసా కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన మెటల్ ఫ్రేములు, రేకుల కప్పులు, తెల్లటి లోహపు కంచెలను తొలగించారు.
కూల్చివేతల అనంతరం ప్రాంగణం వెలుపల విరిగిన ఇనుప గేట్లు, లోహపు కడ్డీలు, సిమెంట్ ముక్కలు కనిపించాయి. వీసా సేవా కిటికీల చుట్టూ ఉన్న గోడల ప్లాస్టరింగ్ కూడా కొంతమేర దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే పాకిస్థాన్ జాతీయ చిహ్నం ఉన్న ప్రధాన ద్వారం, బయటి కాంపౌండ్ గోడలకు ఎలాంటి నష్టం జరగలేదని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను బట్టి స్పష్టమవుతోంది.
ఇస్లామాబాద్ చర్యలకు ప్రతిచర్యగా ప్రచారం?
ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం వెలుపల పాకిస్థాన్ అధికారులు భద్రతా బారికేడ్లను తొలగించిన మూడు రోజులకే ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ వద్ద భారత అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఢిల్లీలో జరిగిన చర్యలు ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిస్పందనగా జరిగాయన్న ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉండగా, ఇటీవల శ్రీనగర్‌లో పర్యటించిన భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్.. జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటిగా అభివర్ణించడంతో పాటు అక్కడి శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశంసలు వ్యక్తం చేసిన విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.

