
అమెరికాలోని అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ అలాస్కాలోని మారుమూల ప్రాంతంలో ఓ చార్టర్ విమానం కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతిచెందారు. అమెరికా సైన్యం ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
అమెరికా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) అలాస్కా ప్రాంత అధికారి క్లింట్ జాన్సన్ తెలిపిన వివరాల ప్రకారం విమానంలో ఇద్దరు పైలట్లు, ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. గురువారం యాంకరేజ్ నుంచి బయలుదేరిన విమానం కేప్ న్యూనెహామ్ ప్రాంతానికి చేరుకుంటుండగా ప్రమాదానికి గురైంది. కేప్ న్యూనెహామ్ లాంగ్ రేంజ్ రాడార్ సైట్ సమీపంలో విమానం కూలిపోయింది.
ప్రమాద స్థలం యాంకరేజ్కు సుమారు 450 మైళ్ల దూరంలో ఉన్న మారుమూల ప్రాంతంలో ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సమాచారం అందిన వెంటనే అలాస్కా రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించింది. తొలుత విమానంలో ఉన్నవారి పరిస్థితిపై స్పష్టత లేకపోయినప్పటికీ అనంతరం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది.
విమానం ప్రమాదానికి గురైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. NTSB కూడా ప్రాథమిక విచారణను ప్రారంభించింది. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

