
ఢిల్లీ ప్రెస్ క్లబ్‌లో ‘మోదీ చాలీసా’పై వివాదం
ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ‘మోదీ చాలీసా’ కార్యక్రమం నిర్వహించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోలు తీవ్ర చర్చకు దారితీశాయి. వీడియోల్లో శ్రీరాముడి రూపంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కటౌట్‌కు కొందరు హారతి ఇస్తూ, “జై జై మోదీ.. హర హర మోదీ” అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కార్యక్రమంపై పెద్ద ఎత్తున విమర్శలు, చర్చలు మొదలయ్యాయి. అయితే, ఈ కార్యక్రమంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. తమ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించలేదని క్లారిటీ ఇచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ)లో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శ్రీరాముడి రూపంలో చిత్రీకరించిన కటౌట్‌కు కొందరు వ్యక్తులు హారతి ఇవ్వడం, అనంతరం ‘మోదీ చాలీసా’ పఠించడం వివాదాస్పదంగా మారింది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “జై జై మోదీ.. హర హర మోదీ” అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా అందులో కనిపిస్తున్నాయి. కటౌట్‌లో ప్రధాని మోదీని కిరీటం, ఆభరణాలతో శ్రీరాముడి తరహాలో చూపించగా, ఆయన చేతిలో విల్లు, బాణం ఉన్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది.
కటౌట్ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు హారతి ఇస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పోస్టర్‌పై “శ్రీ నరేంద్ర మోదీ చాలీసా” అని పేర్కొన్నట్లు వీడియోల్లో కనిపించింది.
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ కార్యక్రమాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు ప్రధాని మోదీని దేవుడి రూపంలో చిత్రీకరించడంపై విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (PCI) స్పందిస్తూ, ఈ కార్యక్రమాన్ని తాము నిర్వహించలేదని స్పష్టం చేసింది. గురువారం ఉదయం తమ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో క్లబ్ ఈ వివరణ ఇచ్చింది.
ఓ సంస్థ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు క్లబ్‌లోని హాల్‌ను అద్దెకు తీసుకున్నట్లు PCI తెలిపింది. అయితే, హాల్‌ను అద్దెకు తీసుకునే సమయంలో అంగీకరించిన నిబంధనలను సంబంధిత సంస్థ ఉల్లంఘించిందని పేర్కొంది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే క్లబ్ అధికారులు జోక్యం చేసుకుని కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు PCI వెల్లడించింది.

