దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో సామాన్యులపై ఆర్థిక భారం పడుతోంది. బహిరంగ మార్కెట్‌లో పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే సబ్సిడీపై బియ్యాన్ని అందిస్తున్న ప్రభుత్వం.. తాజాగా కిలో ఉల్లిపాయలను రూ.35కే విక్రయిస్తోంది. త్వరలోనే కందిపప్పు, పామాయిల్, పంచదార, గోధుమ పిండిని కూడా రాయితీ ధరలకు అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

విజయవాడలోని రైతు బజార్‌లో కిలో ఉల్లిపాయలను రూ.35కు విక్రయించే కౌంటర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో 130 రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాలను ప్రారంభించినట్లు తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో ఉల్లిపాయల ధర రూ.60 నుంచి రూ.70 వరకు ఉండటంతో.. ప్రజలకు అందుబాటులో ఉండేలా రూ.35కే విక్రయిస్తున్నామని చెప్పారు.

సబ్సిడీ ఉల్లిపాయలు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డును తప్పనిసరిగా చూపించాలని అధికారులు సూచించారు. ఒక్కో కుటుంబానికి నెలకు 2 కిలోల చొప్పున రాయితీ ఉల్లిపాయలను అందిస్తున్నారు. రైతు బజార్లతో పాటు మొబైల్ కౌంటర్లు, మినీ లారీల ద్వారా కూడా ఉల్లిపాయలను నేరుగా ప్రజలకు అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఇదే సమయంలో త్వరలో రేషన్ షాపుల ద్వారా కందిపప్పు, పామాయిల్, పంచదార, గోధుమ పిండిని కూడా సబ్సిడీ ధరలకు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి 1.20 లక్షల టన్నుల కందిపప్పును అందించేందుకు అంగీకరించిందని తెలిపారు.

బియ్యం కొరతపై మంత్రి కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో బియ్యం కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఖరీఫ్ సీజన్‌లో సేకరించే ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలకు వినియోగిస్తామని తెలిపారు.

ఎల్‌నినో పరిస్థితులను సాకుగా చూపి ఆహార ధాన్యాలు, నిత్యావసర సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలించే ప్రయత్నాలు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తుందని తెలిపారు.

By Ramya