రాయలసీమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. ‘రైజింగ్ రాయలసీమ’ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే డిమాండ్‌కు సంఘీభావంగా పులివెందులలో టీడీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని మాట్లాడారు.

అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా సీఎం చంద్రబాబు ప్రకటించనున్నారని తెలిపారు. హార్టికల్చర్ హబ్ అభివృద్ధి కోసం రూ.1 లక్ష కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టులకు రూ.26 వేల కోట్లు కేటాయించడంతో పాటు ప్రతి ఎకరాకు నీరు అందించేలా చర్యలు చేపడతామని చెప్పారు.

రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల్లో భాగంగా వేర్‌హౌస్‌లు, కోల్డ్‌ స్టోరేజ్‌లను కూడా నిర్మిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పులివెందులకు సాగునీరు అందించలేకపోయారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రి సవిత విమర్శలు చేశారు. ప్రస్తుతం పులివెందుల ప్రజలకు రూ.480 కోట్లతో తాగునీటి సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి భారీ మెజారిటీతో విజయం అందించారని మంత్రి తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ పులివెందుల మున్సిపాలిటీలో టీడీపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. పులివెందుల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సవిత స్పష్టం చేశారు.

By Rajini